Devotional

మార్గశిర మాసం.. ముక్తికి మార్గం – TNI ఆధ్యాత్మిక వార్తలు

మార్గశిర మాసం.. ముక్తికి మార్గం  – TNI ఆధ్యాత్మిక వార్తలు

*ఈరోజు నుండి – మార్గశిర మాసారంభం
*మార్గశిర మాసం అనగా…..*
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.భగవద్గీతలోని విభూతియోగంలో – *”మాసానాం మార్గశీర్షంz”* మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి.

అందుకే…. మార్గశిర మాసంలో – ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో… *”ఓం నమో నారాయణయ'”* అనే మంత్రాన్ని స్మరించాలి.

ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని, ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.మార్గశిర శుద్ధ షష్ఠి – *’స్కంద షష్ఠి’.* శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని *’సుబ్రహ్మణ్య షష్ఠి’* అని అంటారు.మార్గశిర శుద్ధ ఏకాదశి *’వైకుంఠ ఏకాదశి’.* దీనినే ‘మోక్ష్తెకాదశి’ అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి… *”గీతాజయంతి”.* సమస్తమానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ *”దత్తాత్రేయ జయంతి”* ని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకొంటారు.
మార్గశిర శుక్ల త్రయోదశినాడు *”హనుమద్‌వ్రతం”,* *”మత్స్యద్వాదశి”,* *”ప్రదోష వ్రతం”* ఆచరించడం పరిపాటి.

*ఈ మాసంలోనే….*
“అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ (మల్ల) ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోzష వ్రతం, శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే “ధనుర్మాసం” అనిఅంటాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది…

1. తిరుమల ఆధ్యాత్మిక కేంద్రమా లేక వ్యాపార కేంద్రమా? ఆస్తులుంటేనే స్వామివారి దర్శన భాగ్యమా?… అంటూ దేశంలోని వివిధ పీఠాలు, మఠాలకు చెందిన పలువురు స్వామీజీలతో కూడిన బృందం టీటీడీని ప్రశ్నించింది. బుధవారం రాత్రి తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో స్వామీజీలు మీడియాతో మాట్లాడారు. బృందం తరఫున విజయవాడ శ్రీ యోగి పీఠానికి చెందిన యోగి అతిదేశ్వరానంద పర్వత స్వామి మాట్లాడుతూ.. స్వామీజీలు అందరూ బృందంగా తిరుమల వెళ్లాలని సంకల్పించి నవంబరు 23న తమకు దర్శనాలు, వసతి కల్పించాలని టీటీడీకి లేఖలు రాశామన్నారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత తమ మఠాలు, ఆస్తుల వివరాలు అడిగారని, అవేమీ లేకుంటే దర్శనాలు కల్పించలేమని టీటీడీ అధికారులు చెప్పారని ఆరోపించారు. మఠాలు, ఆస్తులు ఉంటేనే స్వామీజీలకు విలువా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి టీటీడీలో అవినీతిపై ధ్వజమెత్తుతామని ప్రకటించారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీస్సులతో త్వరలో ఏపీలో అత్యుత్తమ రాజకీయ పార్టీని స్థాపిస్తామని ప్రకటించారు.

2. పుట్టపర్తి ప్రశాంతి నిలయం లో సత్యసాయిబాబా 97వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సాయికుల్వంతులో విద్యార్థుల గురువందన సమర్పణతో వేడుకలు ప్రారంభమయ్యా యి. ట్రస్టు సభ్యులు, పలువురు ప్రముఖులు, వేలాది మం ది భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. కాగా.. సత్యసాయి శత జయంతి వేడుకల నాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి మొక్కల పెంపకాన్ని చేపట్టేందుకు ట్రస్టు సభ్యులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యు డు నాగానందం వార్షిక ఆదాయ వ్యయాలను ప్రకటించా రు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఆదా యం సమకూరిందని, ఇందులో విద్య, వైద్యం, తాగునీటి సే వలకు రూ.120 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. ఇవి కాక రూ.50 కోట్లు నిర్వహణ, పెట్టుబడికి ఖర్చు చేశామని తెలిపారు.

3. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.

4. హనుమంత వాహనంపై పద్మావతి అమ్మ అభయం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.