DailyDose

కన్నడిగులు పాతకాలంలో ఎలా ఉండేవాళ్లో ఈ గార్డెన్‌కి వెళ్లి తెలుసుకోవచ్చు

కన్నడిగులు పాతకాలంలో ఎలా ఉండేవాళ్లో ఈ గార్డెన్‌కి వెళ్లి తెలుసుకోవచ్చు

మనం ఎవరం? ఎక్కడినుంచి వచ్చాం? మన మూలాలేమిటి?.. అనేది తెలుసుకోగలిగితే జీవిత పరిమళాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు. కర్ణాటకలోని ఓ నమూనా గ్రామాన్ని చూస్తే అలనాటి పల్లెలే గుర్తుకొస్తాయి. సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరానికి అందించడానికి రూపుదిద్దుకున్న ఆథీమ్‌ పార్క్‌ పేరు.. రంగోలి గార్డెన్‌.
rangoli-garden1-1-V-jpg-816x480-4g
కన్నడిగులు కూడా మనలానే సంప్రదాయ ప్రియులు. కొత్తకు పట్టంకడుతూనే పాతను ప్రేమిస్తారు. హాలీవుడ్‌ సినిమాలకు ఫిదా అవుతూనే, తరాల కళలను గౌరవిస్త్తారు. ఆ మక్కువకు సాక్ష్యమే.. బెంగళూరు శివార్లలోని, జక్కూరులో ఉన్న రంగోలి గార్డెన్‌. కర్ణాటక ప్రజల ఆహార అలవాట్లు, కన్నడనాడు సంస్కృతీ సంప్రదాయాలు, జీవన పరిస్థితులు, భారతీయ సంస్కృతి.. రంగోలి గార్డెన్‌లో ప్రతిబింబిస్తాయి. మెట్రో కల్చర్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ఈ గార్డెన్‌ చక్కని ఉపశమనం. ఓ వారంతపు మజిలీ.
rangoli-garden2
పర్యాటక పల్లెటూరు..
కాలం గడిచేకొద్దీ గతకాలపు తీపి గుర్తులను మరచిపోతున్నాం. మూలాలను విస్మరిస్తున్నాం. నగరాలు, పట్టణాల్లోనే ఉంటున్న పిల్లలకు పల్లెదనపు మాధుర్యం తెలియడం లేదు. సంప్రదాయంపై ధ్యాస సన్నగిల్లుతున్నది. వారసత్వం అంటే తల్లిదండ్రుల ఆస్తులు కాపాడటమే అనుకుంటున్నారు. కానీ అసలైన వారసత్వం మన మూలాల్ని వెతుక్కోవడమే అనే సత్యాన్ని గ్రహించాలి. రంగోలి గార్డెన్‌ రూపకల్పన వెనుక ఉద్దేశమూ ఇదే. ఒక్కమాటలో చెప్పాలంటే.. రంగోలి ఒక క్లాసికల్‌ విలేజ్‌. కళాత్మకత, చారిత్రక నేపథ్యం అడుగడుగునా స్ఫురిస్తాయి. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువుకూ, ప్రతి బొమ్మకూ ఓ నేపథ్యం ఉంటుంది.
rangoli-garden8
నాలుగు ఎకరాల్లో విస్తరించిన రంగోలి గార్డెన్‌..
మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ ఎనర్జీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంగణంలో ఉంది. ఒకటిరెండు శతాబ్దాల క్రితం గ్రామీణ కర్ణాటక ఎలా ఉండేది? అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు? వారి వృత్తి వ్యాపకాలేమిటి?.. వంటివి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జానపద పండితుడు డాక్టర్‌ టీబీ సోలబక్కనవర్‌ ఆలోచనల్లోంచి పుట్టిందే రంగోలి గార్డెన్‌. ప్రస్తుతం దీనికి రాజు కున్నూరు ఎండీగా వ్యవహరిస్తున్నారు. రంగోలి గార్డెన్‌లో 1000కి పైగా ఇన్‌స్టలేషన్లు ఉన్నాయి. వీటిని గోటగోడి అనే గ్రామానికి చెందిన 150 మంది కళాకారులు రూపొందించారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ వైభవం ఒకే గొడుగు కిందికి తెచ్చిన సంప్రదాయ గ్రామం.. రంగోలి గార్డెన్‌.
Rangoli-Garden3
కుల వృత్తులు
కర్ణాటకలోని సగటు గ్రామీణ జీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ ఇక్కడ పొందుపరిచారు. ఒక్కో ఇన్‌స్టలేషన్‌ ముందు దానికి సంబంధించిన వివరాలతో బోర్డు ఉంటుంది. సబ్బండ వర్ణాల సమాహారం ఇది. చేనేత సాంచెలు, పాతకాలం దుకాణాలు, క్షవర శాలలు, ఇస్త్రీ షాపులు.. వరుసగా కనిపిస్తాయి. గొర్రెల కాపరులు, స్వర్ణకారులు, గీతకార్మికులు, వడ్రంగులు, గానుగపట్టేవారు.. ఇలా అందరి జీవనవిధానమూ ఇక్కడ దర్శనమిస్తుంది. సంప్రదాయ కుస్తీ పోటీలు, యక్షగానాది కళల ప్రదర్శనకు రంగోలి గార్డెన్‌ వేదిక అవుతుంది. వ్యవసాయం ఎలా చేస్తారో, ఉద్యానసాగు ఎలా ఉంటుందో ఇక్కడ కళ్లారాచూసి తెలుసుకోవచ్చు.
rangoli-garden4
రంగోలి గార్డెన్‌ ప్రధాన ఆకర్షణ వ్యవసాయ కేంద్రం. ‘బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటే ‘సూపర్‌ మార్కెట్‌ నుంచి’ అని జవాబిచ్చే నేటితరం పిల్లలకు సేద్యం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది రంగోలి. పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, ఏటికేతం పట్టి నీటిని తోడటం, పంట నూర్పిడి.. తదితర కార్యకలాపాల గురించీ తెలుసుకోవచ్చు. సంత, జాతర వంటి దేశీయ విపణులనూ వీక్షించవచ్చు. అన్నట్టు, ఇక్కడ కన్నడ సంప్రదాయ భోజనమూ లభిస్తుంది. హోళిగలు, చిత్రాన్నం, బిసిబేళెబాత్‌ కొసరికొసరి వడ్డిస్తారు. రంగోలీని సందర్శించినప్పుడు హైదరాబాద్‌లోని శిల్పారామం గుర్తొచ్చి తీరుతుంది. మదిలో తెలంగానం వినిపిస్తుంది.
rangoli-garden5
rangoli-garden6
rangoli-garden7-1536x1024
rangoli-garden11
dice gif