Business

తీవ్రతరం కానున్న డీజిల్ కొరత

తీవ్రతరం కానున్న డీజిల్ కొరత

రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచ దేశాలకు డీజిల్‌ కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన చమురు విపణుల నుంచి సరఫరాలు తగ్గుతున్నాయి. అమెరికా, ఐరోపాల్లో డీజిల్‌ నిల్వలు కనిష్ఠ స్థాయిలకు చేరుతుండగా, శీతకాలం నేపథ్యంలో ఇంటి వెచ్చదనం కోసం డీజిల్‌ వినియోగం పెరుగుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల నిషేధానికి ఐరోపా కూటమి విధించుకున్న గడువు సమీపిస్తుండటం ఆందోళనను పెంచుతోంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా తగ్గింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ఆంక్షల సమయంలో డిమాండు తగ్గినపుడు, కొన్ని రిఫైనరీలు లాభదాయకత లేని ప్లాంట్లను మూసివేశాయి. దీంతో రిఫైనింగ్‌ సామర్థ్యమూ పరిమితమైంది. 2020 నుంచి అమెరికాలో రిఫైనింగ్‌ సామర్థ్యం రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు అంచనా. అమెరికాలో డీజిల్‌, హీటింగ్‌ ఆయిల్‌ నిల్వలు నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయని వార్తలొస్తున్నాయి. ఐరోపాలో ఎగుమతిపరమైన అవరోధాలు, సిబ్బంది సమ్మెతో రిఫైనింగ్‌ సామర్థ్యంపై ప్రభావం పడింది. ఇక్కడా డీజిల్‌ నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయన్నది అంచనా. రష్యా నుంచి చమురు దిగుమతుల నిషేధాన్ని 2023లో అమల్లోకి తేవాలన్నది ఐరోపా కూటమి ప్రణాళిక. ప్రపంచంలో అత్యధికంగా డీజిల్‌పై ఆధారపడేది ఐరోపా కూటమే. ఆ దేశాలు ఏడాదికి దిగుమతి చేసుకునే 50 కోట్ల బ్యారెళ్ల డీజిల్‌లో సగం వరకు రష్యా నుంచే ఉంటాయి. అమెరికా ఇప్పటికే రష్యా నుంచి దిగుమతులను నిలిపివేసింది. ఈ పరిణామాలతో డీజిల్‌ కొరత మరింత తీవ్రం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.