తిరుమల లో సహస్ర దీపాలంకార సేవ :-
ఈ ఆర్జిత సేవ ఖరీదు 500/- ఒకరికి. ఈ టిక్కెట్లు ప్రతీ నెల ఆన్లైన్ లో సులభంగా లభిస్తుంది. గుడికి కుడివైపు ఉన్న మండపంలో సాయంత్రం 5 గంటలకు ఈ సేవ మొదలు అవుతుంది. మీరు ముందుగా వెళితే మండపం ఎదురుగా కూర్చుని చూడవచ్చు. ఈ కార్యక్రమం ఆరుబయట జరుగుతుంది. సేవ టిక్కెట్ లేకపోయినా భక్తులు చూడవచ్చు. ఈ సేవ పూర్తి అయిన తర్వాత టిక్కెట్ ఉన్న భక్తులు ప్రక్కనే ఉన్న సుపధం ఎంట్రన్స్ ద్వారా దర్శనానికి పంపుతారు. ఈ సేవ SVBC భక్తి చానల్ లో ప్రతీ రోజూ లైవ్ వస్తుంది.
సేవ జరిపే విధానం :
ప్రతిరోజు కల్యాణోత్సవం,ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం… ఉత్సవాలన్నీ పూర్తి అయిన తర్వాత శ్రీదేవి, భూదేవులతో కూడిన శ్రీమలయప్పస్వామి తిరుచ్చి) ఎక్కి ఆలయ వెలుపల వున్న కొలువు మండపానికి ఛత్రచామర మంగళ వాద్య సమేతంగా తరలివస్తారు. ఆ కొలువు మండపంలో ఆ సమయానికి 1008నేతి వత్తులను వెలిగిస్తారు. ఆ నేతి దీపాల మధ్యలో శ్రీస్వామి వారి తిరుచ్చిని గొలుసులతో వేలాడదీసి ఊపుతారు. మంగళ వాద్యాలు మోగుతుండగా వేదమంత్రాల మధ్య శ్రీస్వామివారు అటు, ఇటు ఊగుతూ ఉండగా శ్రీ స్వామివారిని వేద పండితులు కీర్తిస్తారు.
ఆ తర్వాత రెండు మూడు అన్నమయ్య కీర్తనలు ఆలాపిస్తారు. కీర్తనలు పాడిన తర్వాత భజంత్రీలు మోగు తుండగా శ్రీస్వామివారికి పంచ కజ్జాయం (చక్కెర, గసగసాలు, ఎండు ద్రాక్ష, జీడి పప్పు, బాదం పప్పు కలిపిన పొడి పొడిగా వున్న ప్రసాదం) నివేదన చేసి నక్షత్ర హారతి ఇస్తారు. పిదప కర్పూర హారతి ఇస్తారు. సహస్ర దీపాలంకార సేవ పూర్తి అయిన వెంటనే శ్రీస్వామివారిని మంగళవాద్యలతో నాలుగు మాఢ వీధులలో ఊరేగించి తిరిగి ఆలయం లోకి తీసుకుని వెళతారు.
*** ఇక్కడ భక్తులు ఓ విషయం గమనించాలి. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం రోజున శ్రీ మలయప్ప స్వామి వారికి బదులుగా శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామి, అలాగే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామలక్ష్మణులు తిరుచ్చి నెక్కి వచ్చి సహస్రదీపాలంకార సేవలో పాల్గొంటారు.