భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రారంభమై నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో తొలిసారిగా భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు వెల్లడించారు.
నగరంలో రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ. మెట్రో కారిడార్ లో విమానాశ్రయం సమీపంలో 2.5 కి. మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ కు రూ.6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. దీనికి డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ లో మెట్రో సేవలు 2017, నవంబర్ 29న అందుబాటులోకి వచ్చాయి. నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మెట్రో రైల్ ఐదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మేర మెట్రో నడుస్తోంది. మెట్రో ప్రారంభమైన తొలిరోజు 2 లక్షల మంది ప్రయాణించగా, ప్రతి రోజు మెట్రోలో 4.40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.