ఫోర్బ్స్ ఏషియా దానకర్ణుల 16వ వార్షిక జాబితాలో ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ సహా ముగ్గురు భారత బిలియనీర్లకు స్థానం లభించింది. హెసీఎల్‌టెక్ గౌరవ చైర్మన్ శివ్ నాడార్, భారత ఐటీ రంగ ఆద్యుల్లో ఒకరు, హ్యాపియెస్ట్ మైండ్స్ చైర్మన్ అశోక్ సూతా ఈ లిస్ట్‌లో నిలిచిన మిగతా ఇద్దరు భారత బిలియనీర్లు. అంతేకాదు, మలేషియాలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కందియాకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ ఏడాది జూన్‌లో 60వ వసంతలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్ అదానీ సామాజిక కార్యక్రమాల కోసం రూ.60,000 కోట్లు విరాళంగా ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. శివ్ నాడార్ విషయానికొస్తే, గడిచిన కొన్ని దశాబ్దాల్లో సామాజిక కార్యక్రమాల కోసం 100 కోట్ల డాలర్ల వరకు దానం చేశారు ఈ ఏడాదిలో ఆయన 14.2 కోట్ల డాలర్లు (రూ.11,600 కోట్లు) శివ్ నాడార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన వైద్య పరిశోధన ట్రస్ట్‌కు అశోక్ సూతా రూ.600 కోట్లు విరాళంగా ఇచ్చారు.