Politics

మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రూ.లక్ష ఇస్తా

మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు  రూ.లక్ష ఇస్తా

గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని.. తాను జగన్ రెడ్డిలా మోసం చేయనని.. దుల్హన్ పథకం కింద రూ.లక్ష చెల్లిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు తెలిపారు.ముస్లిం మైనారిటీ పిల్లల్లో ఉన్నత చదువులు అవసరం అని విదేశీ విద్య పథకం పెట్టానని, విద్యతోనే మార్పు అని గుర్తించి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు. ఐటీ రంగంతో జీవితాలు మారుతాయని ఐటీ కంపెనీలను ప్రోత్సహించానని, ముస్లింలకు విదేశీ విద్యతో మంచి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేశానని చెప్పారు. ముస్లింలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచామన్నారు. ఇప్పుడు అన్నీ ఆపేశారని.. అడిగితే కేసులు పెడతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం హైదరాబాద్‌లోనే హజ్ హౌస్ కట్టానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నుంచే యాత్రకు వెళ్లే అవకాశం కల్పించానని, హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశానని చెప్పారు. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టానని విభజన తరువాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పండుగల సమయంలో 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ టీడీపీ అని.. సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు అందజేశామన్నారు. తెలుగుదేశం వచ్చిన తరువాతే హైదరాబాద్‌లో మత కలహాలు లేకుండా చేశామన్నారు. 2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చామని, వాటన్నింటిని జగన్ వచ్చిన తరువాత రద్దు చేశాడని మండిపడ్డారు. పెళ్లి కానుక కింద లక్ష ఇస్తాను అని చెప్పి నిలిపివేశాడని విమర్శించారు