న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. నవంబర్ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. గత కొన్ని నెలలుగా కొరకరాని కొయ్యగా మారిన రిటైల్ ద్రవ్యోల్బణం ఎట్టకేలకు దిగొచ్చింది. నవంబర్ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. 11 నెలల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యానికి 4 (+/-2) శాతానికి లోపే నమోదు కావడమూ గమనార్హం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం కీలక గణాంకాలను వెలువరించింది.
గతేడాది నవంబర్‌లో 4.91 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా 6 శాతానికి పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్‌లో సైతం 6.77 శాతం నమోదైంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. మొత్తంగా 2.25 శాతం మేర పెంచింది. ద్రవ్యోల్బణం కట్టడికి అర్జునుడిలా దృష్టి సారించామని చెప్పిన ఆర్‌బీఐ అదుపు చేయడంలో కొంతమేర విజయం సాధించింది. అయితే, రాబోయే 12 నెలలు మాత్రం 4 శాతానికి ఎగువనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.