విదేశాల్లో మొట్టమొదటగా లండన్‌లోని టవర్ బ్రిడ్జి దగ్గర బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సమయంలో “దేశ్ కి నేత కేసీఆర్” “అబ్ కీబార్ కిసాన్ సర్కార్” నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. లండన్‌లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో గులాబీ జెండాను మొదటిసారి లండన్‌లో ఎగురువేసి కేసీఆర్‌కు మద్దతు తెలిపామని గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ జెండాను మొదటగా ఎగురవేశామని అశోక్ పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు కావాలంటే అది కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని అశోక్ చెప్పారు. భారత దేశం నుంచి బీఆర్‌ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శి సత్య చిలుముల, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృథ్వీ రావుల, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు