సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దక్షిణాదితో పాటు హిందీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు తారలు నిర్భయంగా మీడియా ముందుకొచ్చి ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులు, అవకాశాల పేరుతో వంచించే వైనం గురించి తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ ఎవరైనా కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన తీసుకొస్తే ఏమాత్రం ఉపేక్షించను. నా శైలిలో జవాబిస్తాను. అవసరమైతే సినిమాల నుంచి తప్పుకొని వేరే రంగాన్ని ఎంచుకుంటాను కానీ కాస్టింగ్ కౌచ్‌కు అస్సలు అంగీకరించను’ అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో నాని సరసన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’లో కథానాయికగా నటిస్తున్నది. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.