మాతృ భూమికోసం మాతృ భాషకోసం తానా చేస్తున్న సేవలు ప్రశంశనీయంగా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. తానా చైతన్య స్రవంతిలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కళారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఖండాంతరాలు దాటి వెళ్ళినా జన్మభూమి ఋణం తీర్చుకొంటున్న తానా సంస్థ సేవలను ఆయన అభినందించారు. మాతృ మూర్తిని, మాతృ భాషను, ఉన్న వూరిని, గురువులను ఎన్నటికీ మరువరాదని, జాతి మనుగడకోసం వీరిని సదా పూజించాలని వెంకయ్యనాయుడు కోరారు. తెలుగు రాష్ట్రాల్లోకన్నా అమెరికాలో తెలుగు వెలుగుతోందని, మాతృ భాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇక్కడున్న తెలుగువారు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెంకయ్యనాయుడు తెలిపారు.
తనతో పాటు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ, ప్రస్తుత ప్రధాని మోడీ, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాతృ భాషలోనే విద్యను అభ్యసించామని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కృష్ణవేణి , కోటా శ్రీనివాసరావు, బ్రహ్మనందం , పి. సుశీల, మురళీమోహన్, గిరిబాబు, పరుచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లను తానా నేతలు ఘనంగా సత్కరించారు.
తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ పొట్లూరి రవి, ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్, డాక్టర్ యడ్ల హేమ ప్రసాద్, మండలపు రవి, సునీల్ పంత్ర, ఉమా కటికి, రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ ప్రముఖ గాయకులు శోభారాజు, రామాచారి, సునీత తదితర తానా నేతలు పాల్గొన్నారు.