తానా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గత సంవత్సరన్నర కాలంలో తన హయాంలో అన్ని రికార్డులే సాధించానని లావు అంజయ్య చౌదరి వెల్లడించారు. శనివారం రాత్రి హైదరాబాద్ దస్పల్లా హోటల్లో నిర్వహించిన తానా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 45 ఏళ్లలో తానాలో 36000 మంది సభ్యులు ఉండగా తన హయాములో కొత్తగా మరొక 36000 మంది నూతన సభ్యులుగా నమోదు అయ్యారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తానా ఫౌండేషన్ లో వందమంది డోనర్స్ సభ్యులు అదనంగా చేరారని తెలిపారు. తానా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్యాన్సర్ శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, ఆదరణ, చేయూత తదితర పథకాల కింద భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంజయ్య పేర్కొన్నారు. 2023 జూలై నెలలో ఫిలడెల్ఫియాలో 23వ తానా మహాసభలు భారీ ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ తనకు తానా అంటే చాలా ఇష్టం అని ఇప్పటివరకు 20 సార్లు వారి మహాసభలకు హాజరయ్యానని పేర్కొన్నారు. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మురళీమోహన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల లోగోను, ప్రోమోను ఆయన ఆవిష్కరించారు. తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మహాసభలకు సంబంధించిన విశేషాలను వివరించి అందరూ హాజరు కావాలని కోరారు. ఈ సభలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జానీ నిమ్మనపూడి ఆధ్వర్యంలో సేకరించిన కోటి రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. తానా ప్రతినిధులు వల్లేపల్లి శశికాంత్, నరేన్ కొడాలి, మందలపు రవి, రాజా కసుకుర్తి, సునీల్ పంత్ర, ఠాగూర్ మలినేని, పురుషోత్తం చౌదరి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామ్ బొబ్బా, అనిల్ సుంకర, బాపిరాజు, రామ్ తాళ్లూరి, సినీ రంగ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నా హయాంలో అన్ని రికార్డులే…తానా కిక్ ఆఫ్ సభలో అంజయ్య
Related tags :