గూగుల్లో మరో కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకురానున్నట్టు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. 100కి పైగా భారతీయ భాషల్లో పదాలు (TEXT), మాట (VOICE) ద్వారా ఇంటర్నెట్‌లో కావాల్సిన అంశాలను వెతికేందుకు (సెర్చ్ చేసే) గూగుల్ కసరత్తు చేస్తోందన్నారు. దీని కోసం అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్( కృత్రిమమేధ)ను వినియోగిస్తామని ఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో సుందర్ పిచాయ్ వివరించారు. కొత్త పద్ధతులను పంచుకోవడానికి తాను భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 1000 భాషలను ఆన్‌లైన్‌లోకి తేవాలన్న తమ ప్రయత్నాల్లో భాగంగానే.. దేశీయంగా 100 భాషల్లోనే సెర్చ్ చేసే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రజలు తమ భాషలో జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందేలా చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మరో ముఖ్య విషయాన్ని కూడా సుందర్ పిచాయ్ వెల్లడించారు. భారత్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్షన్ సెర్చ్’ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా విజన్ వల్లే దేశంలో సాంకేతికత మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకున్నాయని సుందర్ పిచాయ్ తెలిపారు.