పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ వారు చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మీది పోలీసు అధికారుల సంఘమా లేక అధికార పార్టీ అనుబంధ సంఘమా అని ప్నశ్నించారు. పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్‌గా మీ సంక్షేమం గురించి మాట్లాడకుండా ఎస్పీ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు.? ఐపీఎస్ అధికారుల సంఘానికి పల్నాడు ఎస్పీ పక్షపాత వైఖరి బాగా తెలుసు. అందుకే వారు మాట్లాడటం లేదు. మాచర్లలో 16వ తారీఖున టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం పోలీసులకు ముందస్తుగా తెలియదని చెప్పడం చాలా అన్యాయం. తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమానికి ముందే వైసీపీ చల్లా మోహన్ రావు కత్తితో స్వైరవిహారం చేస్తే మీ పోలీసులు అతన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు. టీడీపీకి చెందిన ఇదేం ఖర్మ కార్యక్రమం జరుగుతుంటే వైసీపీ వారిని ఎందుకు అనుమతించారు? వారిని ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదు? మాచర్లలో జరిగినవి మీ ఎస్పీకి చిన్న, చిన్న సంఘటనలా కనపడతాయా? మీ ఎస్పీ ఉద్దేశం ఏంటి? పది, పదిహేను మంది టీడీపీ వారిని హత్య చేయాలనా? అప్పుడు పెద్ద సంఘటనగా పరిగణిస్తారా? నిస్సందేహంగా పల్నాడు ఎస్పీ పక్షపాత దోరణితో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడన్నది నిర్వివాద అంశం. ముమ్మాటికి నిజం. సంఘటన జరిగి వారం రోజులైనా దాడి చేసిన ఒక్క వైసీపీ దుండగుడిని కూడా అరెస్టు చేయకపోవడం ఎస్పీ పక్షపాత దోరణికి నిదర్శనం.’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
‘‘అవగాహన లేకుండా మా అధినేత చంద్రబాబును తప్పు పట్టిన మీరు, మీ సంఘం పరిధులు గుర్తించి మీ జీతాలు ప్రతినెలా ఒకటో తారీఖున వచ్చేటట్లు చూసుకోండి. 10 నెలల నుంచి ప్రభుత్వం మీకు టీఏ మరియు డీఏలు ఇవ్వడం లేదు. దాని గురించి అడగండి. మీ సరెండర్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఆగిపోయింది. దాని గురించి అడగండి. అడిషనల్ సరెండర్ లీవ్, ఎన్ క్యాష్ మెంట్ లేదు. దాని గురించి ప్రశ్నించండి. మీకు యూనీఫాం అలవెన్సు బకాయి ఉన్నది. దాని గురించి అడగండి. ఎందరో సీఐలు, ఎస్ఐలు వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉంటూ జీతాలు లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి ప్రశ్నించండి. అది మీ సంఘం బాధ్యతని గుర్తించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ సంఘానికి ఎన్నికలు లేవు. త్వరలో ఎన్నికలు నిర్వహించమని డీజీపీని అడగండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించి ఎస్పీ రవిశంకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, దీని తెర వెనుక కథ నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ సీతారామాంజనేయులను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని వర్ల రామయ్య తెలిపారు.