5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చి, తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిందిగా జనబాహుళ్యాన్ని ఏకగ్రీవంగా కోరిన సమాచారం ప్రజలను చేరింది. మనం మాట్లాడే వాడుక బాషే పెనుప్రమాదంలో ఉన్నదని, తెలుగు వాడకంలో ఉంటేనే భాష సజీవంగా ఉంటుందనే గ్రహింపు తెలుగు వారిలో కలిగించటానికి ఈ మహాసభలు ఎంతగానో ఉపకరించాయి. తెలుగు పత్రికలు ఈ విషయంలో నిర్వహించిన పాత్ర గణనీయమైనది. సహకరించిన సంపాదకులకు పాత్రికేయులకు కృతఙ్ఞతలు.
యువ రచయితలు, ఉపాధ్యాయులు ఈ సభల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు తమ గళాన్ని ఘనంగా వినిపించారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర అనే అంశంపై ప్రధానంగా జరిగిన సదస్సులలో వివిధ రంగాలకు చెందిన రచయితలు పెచ్చుమీరుతున్న వాణిజ్య సంస్కృతి పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత గురించి విస్తృతంగా చర్చించారు.
మూడు వేదికలపైన సమాంతరంగా 30కి పైగా సదస్సులు, కవిసమ్మేళనాలు, వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. జాతీయ ప్రఖ్యాతి పొందిన యువ అష్టావధానులతో అద్భుతావధానం, 15 మంది కవులతో గజల్స్ ముషాయిరా, కళారత్న కె వి సత్యనారాయణ బృందం నిర్వహించిన ఆముక్తమాల్యద నృత్య రూపకం, నేక్షిత అనే చిన్నారి చేసిన నృత్యప్రదర్శన ఈ మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధుల కోసం, రాష్ట్రేతరాంధ్ర ప్రతినిధులకోసం వేర్వేరు సదస్సులు జరిగాయి.
సభలను ప్రారంభించి, భాషోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవలసిన అవసరాన్ని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు నొక్కి చెప్పగా, భారత సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ యన్. వి. రమణ తెలుగు భాషను ఆధునీకరించి, సాంకేతిక ప్రగతితో అనుసంధానం చేయటం ద్వారా తెలుగును ‘ప్రపంచతెలుగు’గా తీర్చిదిద్దాలన్నారు. యువతను అభ్యుదయమార్గాన నడిచేలా మార్గదర్శనం చేయాల్సిన అవసరాన్ని శ్రీ జె. డి. లక్ష్మీనారాయణ నొక్కి చెప్పగా ప్రభుత్వాధినేతలకన్నా రచయితలే ఎక్కువ ప్రభావశీలురని, సమాజాన్ని మేల్కొల్పగలిగేది వారేనని శ్రీ గరికపాటి అన్నారు. ఎన్ని ఇతర భాషలను ప్రోత్సహించినా మాతృభాషకు ప్రాధాన్యత తగ్గకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎ. వి. శేషశాయి అన్నారు.
సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాం. భవిష్య కార్యాచరణతో మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు ఈ మహాసభలు స్ఫూర్తిదాయకం కాగలవని నమ్ముతున్నాం.
మండలి బుద్ధప్రసాద్ గుత్తికొండసుబ్బారావు డా|| జి వి పూర్ణచందు