శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణలోని ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీరామనగరంలో దిగిన రాష్ట్రపతికి త్రిదండి చినజీయర్‌స్వామి సహా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సమతామూర్తి కేంద్రంలోని దివ్యక్షేత్రాలను, సమతామూర్తి బంగారు ప్రతిమను దర్శించుకున్న రాష్ట్రపతి స్ఫూర్తి కేంద్రంలో శ్రీరామానుజాచార్యుల చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. సమతామూర్తి భారీ విగ్రహం వద్ద ఆసీనులైన ద్రౌపదిముర్ముకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశిష్టతలు, ప్రత్యేకతలను చిన జీయర్ స్వామి స్వయంగా వివరించారు. ఆ తర్వాత సమతామూర్తి చెంత నిర్వహించిన లేజర్ షోను వీక్షించిన రాష్ట్రపతి ముగ్దులయ్యారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.