DFW క్యారల్టన్లోని డాలస్ పామ్స్లో నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన ప్రవాసాంధ్రుడు కేసీఎ చేకూరికి $25వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. ఆయన రేపు(మంగళవారం) బెయిల్పై విడుదల అవుతారని ప్రక్రియను సమన్వయపరుస్తున్న ఆయన సన్నిహితులు వెల్లడించారు.
* అసలేం జరిగిందంటే…
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలువురు సినీ నటుల పాటలను ప్రదర్శించారు. సినిమా పాటల విషయంలో గొడవ జరగలేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో వైకాపా పాటను ప్రదర్శించగా, తాము కూడా డబ్బులు చెల్లించి కార్యక్రమానికి హాజరయ్యామని తెదేపా పాటలు కూడా ప్రదర్శించాలని ఎన్నారై తెదేపా శ్రేణులు కోరగా పాటను ప్రదర్శించారు. కానీ పాట ప్రారంభించిన 2నిముషాలకే అర్ధాంతరంగా నిలిపివేసి వేడుక ముగిసిందని నిర్వాహకులు ప్రకటించడంతో కేసీ చేకూరి తదితరులతో కూడిన ఎన్నారై తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో వేడుక భద్రతా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తోపులాట జరిగినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో కేసీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.