Politics

వేడెక్కుతున్న ఏపీ రాజకీయం.

వేడెక్కుతున్న ఏపీ రాజకీయం.

జనరల్‌గా ఈ సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి.. అక్కడ రాజకీయాలు దుమ్మురేపాలి. కానీ విచిత్రంగా.. తెలంగాణలో కంటే.. ఏపీలో రాజకీయాలు హాట్‌గా ఉన్నాయి. చలికాలంలో హీట్ పుట్టిస్తున్నాయి.

తెలంగాణలో మునుగోడు ఎన్నికల తర్వాత.. ఎమ్మెల్యేల ఎర కేసు కారణంగా బీజేపీ కాస్త సైలెంట్ అయ్యింది. అటు అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ కూడా గతి తప్పింది. దాంతో తెలంగాణలో రాజకీయ వేడి కాస్త తగ్గింది. అదే సమయంలో.. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధానంగా.. టీడీపీ సభల్లో 11 మంది సామాన్యులు చనిపోవడంతో.. అది ఆ పార్టీకి భారీ దెబ్బగా మారింది. ఇదే అదనుగా అధికార పక్షం.. తెలుగు దేశం (TDP)పై విరుచుకుపడింది. ఈ అంశం ప్రజల్లో చర్చకు దారితీసింది. కాస్తో కూస్తో కోలుకుంటున్నట్లు కనిపించిన టీడీపీ పని ఇక అయిపోయినట్లే అనే వాదన కొంతమంది నుంచి వినిపిస్తోంది. ఈ విమర్శల్ని బలంగా ఖండించే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు కనిపించట్లేదు.
తాజాగా ఏపీ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఏపీ రాజకీయాల్ని ఒక్కసారిగా ప్రభావితం చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అడుగులపై అధికార వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. ఇలాంటివి ముందే ఊహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ పరిధి ఏపీకి మాత్రమే పరిమితం కాదనీ.. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో ఏపీ ఒకటి మాత్రమే అని చెప్పడం ద్వారా.. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం బీఆర్ఎస్‌కి చాలా చిన్న విషయం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలవరం లాంటి అంశాల్ని ప్రస్తావించకుండా.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, ఉచిత విద్యుత్ వంటి అంశాల్ని టచ్ చేస్తూ.. జాతీయస్థాయి నేతలా మాట్లాడారు. ఐతే.. సంక్రాంతి తర్వాత ఇతర పార్టీల నేతల్ని కలుపుకుంటామనీ, సిట్టింగులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడం ద్వారా… వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేసినట్లైంది. అందువల్ల ఇప్పట్లో ఈ రాజకీయ వేడి తగ్గే ఛాన్స్ లేదనిపిస్తోంది.

యువత టార్గెట్‌గా జనసేన :

ఏపీలో క్రమంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తున్న జనసేన.. త్వరలోనే బస్సు యాత్ర చేయడం ద్వారా మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అలాగే యువతను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. యువత తమకు ఏం కావాలో చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. ఇలా ఈ పార్టీ క్రమంగా జోరు పెంచుతోంది. ఐతే.. జనసేనకు క్షేత్రస్థాయిలో ఎంతవరకూ బలం ఉంది అనేది ప్రస్తుతం తెలియకపోయినా.. అధికార వైసీపీ.. ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ.. జనసేన తమకు బలమైన ప్రత్యర్థేనని చెప్పకనే చెబుతోంది. అందువల్ల జనసేన వేసే ప్రతీ అడుగూ.. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.

ఇక బీజేపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. అప్పుడప్పుడూ సోమూ వీర్రాజు లాంటి వారు స్పందిస్తున్నారు. ఇలా ఎన్నికలకు ఇంకా 14 నెలలు టైమ్ ఉన్నా… ఇప్పటి నుంచే ఏపీ రాజకీయాల్లో జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్, జనసేన వల్ల ఇకపైనా ఈ వేడి కంటిన్యూ అయ్యేలా ఉంది. ఇప్పటివరకూ విమర్శలు, కౌంటర్లతోనే సాగిన ఈ రాజకీయం.. త్వరలో నేతల చేరికలు, జంపింగ్‌లతో మరింత రంజుగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి