సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు
ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం వద్దు
తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీని ఉపయోగించుకోండి
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు : టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్
సంక్రాంతికి ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష
సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాల్లో అదనపు చార్జీలు చెల్లించి, ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు ఆయన సూచించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ఉన్నతాధికారులు, ఆర్ఎంలు, డీఎంలతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గురువారం ఆన్‌లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పండుగ టీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో డిపో మేనేజర్, ఆపై అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షించాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్.ఎం.లు, డీఎంలకు సూచించారు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీస్‌లను పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు.
రానుపోనూ ఒకే సారి టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు సజ్జనర్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సంస్థ ఎండీ సజ్జనర్ తెలిపారు. అందులో 585 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 14 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని వివరించారు.
అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు.
ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ 54, విశాఖపట్నం 19, అమలాపురం 23, శ్రీకాకుళం 9, ఏలూరు 11, రాజమండ్రి 12, గుంటూరు 29, బాపట్ల 5, చీరాల 7, మచిలీపట్నం 5, గుడివాడ 6, తెనాలి 4, రాజోలు 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, మునిశేఖర్, యాదగిరి, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథ్‌రావు, సీపీఎం కృష్ణకాంత్‌తో పాటు ఆర్‌ఎంలు,డిప్యూటీ ఆర్.ఎం.లు, డీఎంలు పాల్గొన్నారు.