Politics

వైకాపాలో పదవుల కోసం.. పాకులాటలు!

వైకాపాలు పదవుల కోసం.. పాకులాటలు!

వైసీపీ నేతల్లో 2023 సంవత్సరం ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఎందుకంటే వరసగా పదవులు వారిని వరించబోతున్నాయి. దీంతో ఆశావహుల శాతం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది వైసీీపీకి పదవుల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 23 ఎమ్మెల్సీ పోస్టులు ఈ ఏడాది ఖాళీ అవుతున్నాయి. వాటిలో సింహభాగం వైసీపీ నేతలకే దక్కనున్నాయి. ఇందుకు కారణమూ లేకపోలేదు. 2023 లో ఎమ్మెల్సీగా ఎన్నికయితే 2029 వరకూ పదవిలో కొనసాగే వీలుంది. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడినా, గెలిచినా తమకు వచ్చే నష్టమేమీ లేదు. తమ పదవీకాలం పూర్తయ్యే సమయానికి మళ్లీ 2029 ఎన్నికలు వచ్చేస్తాయి. ఈమేరకు ఆశావహులు పార్టీలో సీనియర్ నేతలను, మంత్రులను కలుస్తున్నారు. తమ బయోడేటాలను వారు నేతలు ముందు ఉంచుతున్నారు. కొంతమంది నేరుగా ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఫైనల్ గా జగన్ నిర్ణయంపైనే ఆధారపడి పదవుల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండటంతో జగన్ కూడా సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. 

ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, స్థానికసంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు విభాగాల్లో వైసీపీకి డోకా లేదు. శాససభలో ఎటూ వైసీపీదే ఆధిపత్యం కాబట్టి ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కానున్న ఏడు ఎమ్మెల్సీల స్థానాలు వైసీపీకే ఖచ్చితంగా దక్కనున్నాయి. ఇక గవర్నర్ కోటాలో రెండు స్థానాలు భర్తీ అవ్వాల్సి ఉంది. ఈ రెండు కూడా వైసీపీ ఖాతాలోకేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక స్థానిక సంస్థల కోటా కింద తొమ్మిది స్థానాలు ఫిలప్ కావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉంది కాబట్టి తొమ్మిది కూడా వైసీపీ నేతలకే దక్కనున్నాయి. అంటే 18 ఎమ్మెల్సీ పోస్టులు ఈ ఏడాది వైసీపీకి దక్కనున్నాయి. ఇక గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం పోటీ జరుగుతుంది. అక్కడ పోటీ తప్పదు. ఆ ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలా చూసుకున్నా పల్నాడు జిల్లాకు 2 ఎమ్యెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.