సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మాటలు ఉత్తర ప్రదేశ్ పోలీసులను అవాక్కయ్యేలా చేశాయి. ఆయన యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ఆదివారం వెళ్లారు.
ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా తేనీరు (టీ) ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తేనీటిని సేవించేందుకు ఆయన తిరస్కరించారు. దానిలో విషం కలిపి తనకు ఇస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన వెంట వచ్చిన తన పార్టీ కార్యకర్తల్లో ఒకరిని పిలిచి, బయట నుంచి ఓ టీని తీసుకురావాలని కోరారు.
”నేను ఇక్కడ టీ తాగను. మాది మేం తెచ్చుకుంటాం. మీ కప్పు తీసుకుంటాం. నాకు మీరు విషం పెడితే పరిస్థితి ఏమిటి? నేను మిమ్మల్ని నమ్మను. బయటి నుంచి తెప్పించుకుంటాను” అని అఖిలేశ్ అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది..
సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న మనీష్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు హజ్రత్‌గంజ్‌లో అరెస్టు చేయడంపై నిరసన తెలియజేసేందుకు అఖిలేశ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి, ధర్నా నిర్వహించారు.
అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అగర్వాల్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.