అత్యంత ఆధునిక ప్రయాణ సౌకర్యంగా మెట్రో రైళ్లను చెప్పొచ్చు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలను చేర్చేందుకు అతిపెద్ద నగరాలన్నీ మెట్రో మంత్రాన్నే జపిస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణానికి కూడా మెట్రో రైళ్లు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అయితే మెట్రో నిర్వహణ, వాటి నిర్మాణ సామర్థ్యంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోతోపాటు దేశంలోని ఇతర మెట్రోలు ఆధునికమే అయినప్పటికీ వాటి నిర్మాణాల్లోని క్వాలిటీపై మాత్రం ఎన్నోమార్లు విమర్శలు వచ్చాయి. మెట్రో పిల్లర్ల పైకప్పుల్లో నుంచి పెచ్చులు ఊడిపోవడం.. ఇలాంటి ఘటనల్లో పలువురు మృతి కూడా చెందారు.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిలికాన్ సిటీలోని నగవర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో ఇద్దరు మృతి చెందారు. బైక్ మీద వెళ్తున్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తండ్రి, కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ట్రీట్‌మెంట్ కోసం వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్‌ను, ఇనుప రాడ్లను తొలగించారు.