నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ప్రతిపక్షాల పై ఒంటి కాలిపై లేచేవారు. అసెంబ్లీలో, పేపర్లలో, టీవీలో ఎక్కడ చూసినా అనిల్ యాదవే కనిపించేవారు. మంత్రి పదవి పోవడంతో ఆయన ప్రాభవం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలైనట్టు అనిల్ యాదవ్ పరిస్థితి తయారైంది. సొంతపక్షమే ప్రతిపక్షంగా మారింది.పోలవరం, టీడీపీ పై అసెంబ్లీలో అనిల్ కుమార్ గర్జించే వారు. జగన్ పై ఈగ వాలనివ్వని సైనికుడిలా బిల్డప్ ఇచ్చేవారు. విపక్షాలంటే గడ్డిపోచల్లాగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ఒక్క నాయకుడితో కూడ సఖ్యత లేదని నెల్లూరు ప్రజానీకం గుసగుసలాడుతున్నారట. 2019 ఎన్నికల్లో చాలా స్వల్ప తేడా నెల్లూరు నుంచి టీడీపీ నారాయణ పై గెలిచారు. ఆ గెలుపులో ఆయన బాబాయ్ రూప్ కుమార్ కీలకంగా పనిచేశారట. కానీ అధికారం రాగానే బాబాయ్, అబ్బాయ్ మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీంతో రూప్ కుమార్ తనదారి తాను చూసుకుంటున్నారట. అనిల్ యాదవ్ తో ఉన్న నేతల్ని తన వెంట తీసుకెళ్లారని, పార్టీలోనే వేరుకుంపటి పెట్టారని సమాచారం. దీంతో దిక్కుతోచక కుడితిలో పడ్డ ఎలుకలా అనిల్ పరిస్థితి తయారైందట.ఆనం కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయం ప్రారంభించిన అనిల్ యాదవ్.. ఆ తర్వాత వారి కుటుంబంతో విబేధాలు పెంచుకున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కూడ సఖ్యతగా మెలగడంలేదనేది నెల్లూరులో టాక్. విపక్షాలను టార్గెట్ చేయడం పక్కన పెడితే సొంత పక్షంతో వేగలేకపోతున్నారట. అనిల్ యాదవ్ పరిస్థితి చూసి టీడీపీ నేతలు అయ్యో పాపం అంటున్నారని నెల్లూరు జనం మాట్లాడుకుంటున్నారు.ఒంటిరి అయిన అనిల్ యాదవ్ ఫ్రస్టేషన్ తో ఉన్నారట. సొంత పార్టీ నేతలే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఇటీవల పలుమార్లు బహిరంగ ఆరోపణలు చేశారు. పార్టీ సమావేశాలు జరిగినా అనిల్ యాదవ్ ను పిలవడం లేదట. దీంతో ఫ్రస్టేషన్ ఇంకా ఎక్కువైందట. ఇటీవల జరిగిన ఆర్యవైశ్య సమావేశానికి అనిల్ యాదవ్ ను పిలవలేదు. దీని పై మాజీ మంత్రి వ్యంగ్యంగా స్పందించారు. ఆ సమావేశానికి వెళ్లిన వారంతా మంచి వెయిట్ ఉన్నవారని, తనకు అంత వెయిట్ లేదని అన్నారట. దీంతో నెల్లూరు వైసీపీలో అనిల్ యాదవ్ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశాలు కూడ తగ్గిపోతాయని అంటున్నారు.