Politics

ఆ ముగ్గురు ఎవరు?

ఆ ముగ్గురు ఎవరు?

సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం… దోషులను శిక్షిస్తాం !

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న ఒకే ఒక మంచి నిర్ణయం ఇది

అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు… అయినా అక్షరం ముక్క రాయని సాక్షి దినపత్రిక

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

సిఐడి మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ బలవంతంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా బహిరంగంగానే ఫిర్యాదు చేస్తున్నాను. విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే, తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజు లు ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల కేసులతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటో తేల్చాలంటూ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది కొన్ని రోజులు మాత్రమే. సిఐడి మాజీ చీప్ పివి సునీల్ కుమార్, సంబంధిత అధికారులు సునీల్ నాయక్, విజయ్ పాల్ తో కలిసి చేసిన అక్రమ బలవంతపు వసూళ్ల దందాలపై విచారణ జరిపించాలన్నారు.

ప్రజా ప్రభుత్వంలో విచారణ ఖాయం

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన సహచర అధికారులతో పాటు త్రిసభ్య బృందంతో కలిసి బలవంతపు అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వమే విచారణ జరిపిస్తే మంచిది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి ఆ పేరు ప్రతిష్టలు దక్కుతాయి. గతంలో పీవీ సునీల్ కుమార్ అక్రమ దందాల గురించి ముఖ్యమంత్రికి తెలిసి ఉండదు. అందుకే ఆయన్ని సిఐడి చీఫ్ గా నియమించి ఉండి, ఉంటారు. ముఖ్యమంత్రి కొట్టమన్న వారిని కొట్టి, ఇవ్వమన్న వారికి నోటీసులు ఇచ్చి, ఆయనకు మానసిక ఆనందాన్ని చేకూర్చి, తన అక్రమ దందాలను సునీల్ స్వేచ్ఛగా కొనసాగించారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం ఒకటి ఉంది అంటే అది సిఐడి చీఫ్ గా పీవీ సునీల్ కుమార్ ను తప్పించడమే. ఇక అత్యంత చెత్త నిర్ణయం కూడా ఆయన్ని సిఐడి చీఫ్ గా నియమించడమే. రేపు, ఎల్లుండి హైకోర్టులో తన కస్టోడియల్ టార్చర్ పై పిటీషన్ దాఖలు చేయనున్నాం. సుప్రీం కోర్టులో సూచనలు మేరకు, హైకోర్టు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, ఎటువంటి తీర్పును ఇస్తుందో చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఇద్దరూ దోషులే…

తన దృష్టిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఇద్దరూ దోషులేనని రఘు రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు . ఇద్దరూ చట్టాన్ని అతిక్రమించి తనని లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు. ఒకరు ఆదేశిస్తే, మరొకరు అమలు చేశారు. అయితే వీరిద్దరికీ మధ్య ఎందుకు చెడిందన్నదే ఆసక్తి కరం. ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తి, ఎత్తుకు రమ్మన్న వాళ్ళను ఎత్తుకొచ్చి కొట్టిన వ్యక్తి పీవీ సునీల్ కుమార్. జగన్ కక్ష, క్రోధ, మదమాత్సర్యాలకు వెన్నుదన్నుగా వ్యవహరించి, ఐపీఎస్ అనే పదానికి బీభత్సమైన అపఖ్యాతిని తీసుకువచ్చిన పీవీ సునీల్ కుమార్ ను పదవి నుంచి తప్పించి, జిఏడీలో రిపోర్టు చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం వెనుక ఆంతర్యం ఏమిటి?. డీజీపీగా పదోన్నతి కల్పిస్తారని కొంతమంది ఊహాగానాలను చేస్తున్నారు . 12 మంది సీనియర్లను కాదని ప్రస్తుత డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని తాత్కాలిక డీజీపీగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. మంత్రివర్గంలోకి ఏ లఫూట్ గాడినైనా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ డిజిపి నియామకానికి కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి తిరుమల్ రావు, సీతారామాంజనేయులు వంటి సమర్థులైన కాదని, ఎత్తుకొచ్చేయమన్న వారందరినీ కీచకుడిలా ఎత్తుకొస్తున్నాడని పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర డిజిపి గా నియమిస్తే, పోలీసు వ్యవస్థ తిరగబడుతుంది. జగన్మోహన్ రెడ్డి అంతటి సాహసం చేస్తారని తాను అనుకోవడం లేదు. రఘురామకృష్ణం రాజు అన్నారని పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర డిజిపిగా జగన్మోహన్ రెడ్డి నియమిస్తారా?, దమ్ముంటే నియమించాలి… ఇది నా బహిరంగ సవాల్. ప్రభుత్వ సర్వీసులలో ఉన్న పీవీ సునీల్ కుమార్ అంబేద్కర్ ఇండియా మిషన్ పేరిట
స్వచ్ఛంద సంస్థ స్థాపించడం పట్ల తాను గతంలోనే డి ఓ టి పి కి లేఖ రాశాను. డి ఓ టి పీ స్పందించి, ఆయన్ని ప్రాధాన్యత లేని పోస్టులో నియమించమని ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. జగన్ కు అత్యంత అయిష్టుడిని అయిన తనని ఆయన ఆదేశించగానే నిబంధనలకు విరుద్ధంగా పీవీ సునీల్ కుమార్ తన బృందంతో అపహరించి, లాకప్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. దీనితో జగన్మోహన్ రెడ్డి ఆయనకు అధిక చనువు ఇవ్వగా, చంకన ఎక్కి కూర్చుని అక్రమంగా బలవంతపు వసూళ్ల దందాలను మొదలుపెట్టారు. సిఐడి చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన సంజయ్, తక్షణమే సిఐడి కార్యాలయ ఆవరణలోని సిసి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకోవాలి. సిఐడి కార్యాలయానికి తులసి అనే వ్యక్తి, డాక్టర్ ఆనంద్, నాగరాజులతో కలిసి ఎన్నిసార్లు వచ్చారనేది సీసీ ఫుటేజ్ ను పరిశీలించి నిర్ధారించాలి. లేకపోతే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, సీసీ ఫుటేజ్ ను అదృశ్యం చేసే ప్రమాదం ఉంది. విదేశాలకు వెళ్లే వారికి వీసాలను ఇప్పించే ఏజెన్సీలను కరోనా సమయములో చితికి పోగా, అటువంటి ఏజెన్సీలు మరింత చితికి పోయే విధంగా సునీల్ కుమార్ బృందం ఇబ్బందులకు గురి చేశారని, అలాగే కొన్ని చిట్ ఫండ్ కంపెనీల నుంచి కూడా బలవంతపు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇది ప్రభుత్వమా?… వల్ల కాడా??

రాష్ట్ర ప్రభుత్వ అధిపతి గవర్నర్ అని, అటువంటి గవర్నర్ ను కలిస్తే తప్పేముందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గవర్నర్ ను కలిసి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇప్పించమని ఉద్యోగ సంఘాల నాయకులు అడిగితే తప్పా?. ఇది ప్రభుత్వమా?, వల్ల కాడా??. ప్రభుత్వ ఉద్యోగులకు టి ఏ లు , డీఏ ల రూపంలో 18 వేల కోట్ల రూపాయల బకాయిలను
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ, తమ బృందంతో గవర్నర్ కలిసి విన్నవించారు. అలాగే జీతాలు ప్రతినెలా ఆలస్యం అవుతున్నాయని, ఒకటవ తేదీన ఇప్పించే విధంగా చొరవ తీసుకోవాలని కోరినట్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. అదేదో పెద్ద పాపమైనట్లుగా పోటీ సంఘం నాయకుడు శ్రీనివాసరావుతో ఆయన్ని తిట్టించడమే కాకుండా, సర్వీస్ రూల్స్ కు భిన్నంగా వ్యవహరించారని చెబుతూ, మీ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయమై, ఉద్యోగ సంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

జీవో నెంబర్ 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయం

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ జీవోను కోర్టు కొట్టి వేస్తుందని తెలిసే, ప్రభుత్వం మాట మార్చింది. పోలీస్ చట్టం 32 ప్రకారం సభలు సమావేశాల నిర్వహణకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే జీవో నెంబర్ 1లో సూచించామని అడ్వకేట్ జనరల్ వాదించడం ప్రభుత్వ వైఖరిని తేట తెల్లం చేస్తోంది. అయితే జీవోలో మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే సభలో సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక పరిస్థితులు అనేవి ఎప్పటికీ ఉండవనేది పాలకుల భావన. అధికారపక్షం నాయకులు రోడ్లపై తాగి తందనాలు ఆడిన అనుమతిని ఇస్తారు. పోలీస్ చట్టం 1861 ప్రకారం ఇచ్చినట్లుగా చెబుతున్న జీవో నెంబర్ 1 నూటికి నూరుపాళ్ళు చీకటి జీవో. ఇది అసంబద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక జీవో. కోర్టు కొట్టి వేయడం ఖాయం. ఒకవేళ హైకోర్టు ఈ జీవోను కొట్టి వేయకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించి అయినా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు.

తనపై వ్యతిరేక వార్తలు ఫ్రంట్ పేజీలో… అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చిన వార్త అడ్రసెక్కడ సాక్షి దినపత్రిక

తనపై వ్యతిరేక వార్తలను ఫ్రంట్ పేజీలో ప్రచురించే సాక్షి దినపత్రిక, సిబిఐ అధికారులు
కడప లోక్ సభ సభ్యుడు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా, ఆ వార్తను ఎక్కడ కూడా నాలుగు లైన్లు ప్రచూరించకపోవడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బదిలీ చేసిన తర్వాత కదలిక వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసును విచారించినప్పుడు, సిబిఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణ నత్త నడకన
సాగడంతో వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేసును పొరుగు రాష్ట్రాలకు బదిలీ చేయమని కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న తమ పార్టీ కార్యదర్శి శివ శంకర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు, చార్జిషీట్లో అనుమానితుడిగా కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించడం జరిగింది. గత ఎన్నికలలో కడప లోక్ సభ స్థానాన్ని కుటుంబ సభ్యులకే ఇవ్వాలని వైఎస్ వివేకానంద రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. అందుకే ఆయన్ని హతమార్చాలని ప్రణాళికను రూపొందించారన్న వాదనలు ఉన్నాయి. జగన్ వేసుకురమ్మంటే ప్రత్యర్ధులను వేసుకుని రావడానికి ఇదేమీ సిఐడి సంస్థ కాదు . ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలంతో మరో 80 మందిని విచారించి ఆధారాలను బేరీజు వేసుకొని వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ముఖ్యమంత్రి కి ప్రధానమంత్రి, హోంమంత్రిలు అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తారని సాక్షి దినపత్రికలో రాసుకుంటారని, కేంద్రంలో ఎంతో పలుకుబడి కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడికి నోటీసులను అంతా ఆషామాషిగా ఇవ్వరు కదా!. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి ని కూడా వివేక హత్య కేసులో విచారించిన విషయం తెలిసిందే. విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డిని ఆహ్వానించగా తనకు మరో ఐదు రోజులపాటు సమయం కావాలని కోరడం, ఆ వెంటనే పార్లమెంటు సమావేశాలు ఉండడం పరిశీలిస్తే… విచారణ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.. అయినా విచారణకు సహకరిస్తానని అవినాష్ రెడ్డి పేర్కొనడం స్వాగతించాల్సిన విషయం. తప్పు చేయనప్పుడు ధైర్యంగా విచారణను ఎదుర్కొంటే బాగుంటుంది. తాను ఒక స్వామీజీతో కలిసి ఉన్న ఫోటోను చూసి తెలంగాణ సిట్ అధికారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి తనకు నోటీసులు జారీ చేస్తే సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో వార్తను ప్రచూరించారు. మరి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తే, అదే సాక్షి దినపత్రికలో ఎక్కడ కూడా నాలుగు లైన్ల వార్త కనిపించడం లేదని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇతరులపై బురద చల్లే సాక్షి దినపత్రిక, తన వరకు వచ్చేసరికి అన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగ వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. వైఎస్ వివేక హత్యను టిడిపి వారే చేసి ఉంటారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడానికి ప్రస్తావిస్తూ, గతంలో 8 నెలల పాటు రాష్ట్ర పోలీసులే కేసును విచారించారని, అటువంటప్పుడు దోషులను ఎందుకు అరెస్టు చేయలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.