Health

హైదరాబాద్​కు ఎల్లో అలర్ట్

హైదరాబాద్​కు ఎల్లో అలర్ట్

టెంపరేచర్​ 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం

రేపటి నుంచి విపరీతంగా మంచు కురిసే చాన్స్

సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ

హైదరాబాద్‌‌లో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక యాక్సిడెంట్లు జరిగే చాన్స్​ ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బుధవారం15 డిగ్రీలు, గురువారం 12 డిగ్రీలు, శుక్రవారం 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.