Politics

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు. రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న అంశం ఇది. ఇదే అంశం పైన ఇండియా టుడే-సీవోటర్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమేననీ సర్వే తేల్చింది. ఎన్డీయేకు 284 సీట్లు – ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గతం కంటే ఎన్డీఏకు తగ్గగా..యూపీఏకు పెరిగాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ పోరు పైన ఆసక్తి కర అంశాలను వెల్లడించింది.

ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై..!

ఇండియా టుడే-సీవోటర్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వే లో ప్రధానంగా ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 శాతం పెరిగింది.

బీజేపీ వ్యతిరేక సీట్లలో పెరుగుదల
కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీని నడిపే నేత ఎవరనే ప్రశ్నకు రాహుల్ గాంధీకి 26శాతం మంది ఓటెయ్యగా.. మరో 17శాతం సచిన్ పైలట్ కు మొగ్గు చూపారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు..ఫెయిల్యూర్స్ పైన తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. అందులో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొవిడ్ మేనేజ్మెంట్ అని 20%, మంది మద్దతుగా నిలవగా.. ఆర్టికల్ 370 రద్దు అని 14% శాతం మంది పేర్కొన్నారు, అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం అని 12% మంది చెప్పారు. మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్ కి 24శాతం మంది, మమతా బెనర్జీకి 20 శాతం మంది మద్దతు ప్రకటించారు. మోదీకి ధీటుగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 13 శాతం మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది.

తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ..

తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వేకు సంబంధించి ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 3, వైసీపీ 22 స్థానాలు గెలుచుకోగా.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆసక్తి కర పోరు కొనసాగనుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. పొత్తుతో ముందుకు వెళ్తుందా అనే దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య మారే అవకాశం ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ గతంలో నాలుగు సీట్లు పొందగా.. ఇప్పుడు కొంత మేర పుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరగ్గా..తెలంగాణలోనూ ఆ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. కానీ, ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.