కుప్పం: వివిధ వర్గాలను అక్కున చేర్చుకుంటూ.. విద్యార్థుల్లో జోష్ నింపుతూ.. పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. బీసీలకు భరోసానిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా సాగింది.
కుప్పంలోని బీఈఎస్ వైద్యకళాశాల వద్ద నుంచి ప్రారంభమైన రెండో రోజు పాదయాత్ర పెగ్గిలిపల్లి, గణేష్‌పురం క్రాస్, కడపల్లి, కలమలదొడ్డిల మీదుగా శాంతిపురం వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. తనను కలిసిన వివిధ వర్గాల ప్రజలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యపరుస్తూ నారా లోకేశ్ ముందుకు సాగారు. గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో కురబ కులస్థులతో లోకేశ్ సమావేశమయ్యారు..
రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు..
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లోకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు లోకేశ్ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల తెచ్చిన కృతజ్ఞతతో అభిమానం చాటుకున్నామని విద్యార్థులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని ఈ సందర్భంగా లోకేశ్ విమర్శించారు. పరిశ్రమలు తరలిపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు యువగళంలో భాగస్వాములు అవ్వాలని లోకేశ్ పిలుపునిచ్చారు. వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతులు చంటి బిడ్డతో వచ్చి లోకేశ్‌ను కలిశారు. బిడ్డకు పేరు పెట్టాలని తల్లిదండ్రులు కోరగా.. సాన్విత అని లోకేశ్ సూచించారు. గణేష్‌పురం క్రాస్‌లో స్థానిక మహిళలు, రైతులతో మాట్లాడారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగి బతుకుభారం అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు బలవంతంగా పెడుతున్నారంటూ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు