భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ భయం మొదలైంది. క్రితం రెండు సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ట్రేడర్లు లబోదిబోమంటున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) పెద్దఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ స్టాక్స్ దారుణంగా పతనమవుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రెండే రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.4 లక్షల కోట్లు పతనమైంది. గౌతమ్ అదానీ సంపద కూడా 20 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా ఏడో స్థానానికి పడిపోయారు. దీనికంతటికీ కారణం.. హిండెన్‌బర్గ్.
అవును.. అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ (Hindenburg Research) సంచలన రిపోర్ట్‌తో అదానీ సంపద ఆవిరైంది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీ గ్రూప్.. భారత స్టాక్‌మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది. రెండేళ్లకుపైగా పరిశోధన జరిపి.. పెద్ద రిపోర్ట్ ప్రచురించింది. అదానీకి 88 ప్రశ్నలు సంధించింది. అంతే.. అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు రోజులు కుప్పకూలాయి. షేరు విలువ దారుణంగా పడిపోయింది. ఇకముందూ ఇది కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో ఈ హిండెన్‌బర్గ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు జనం. అసలు హిండెన్‌బర్గ్ ఏంటి తెలుసుకుందాం.
38 ఏళ్ల కుర్రాడే..
హిండెన్‌బర్గ్ వెనకుండి నడిపించేది 38 ఏళ్ల కుర్రాడు. ఇతడే ఒక్క రిపోర్ట్‌తో వణికిస్తున్నాడు. ఈ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఫర్మ్ అనేది అమెరికా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. నాథన్ అండర్సన్ (Nathan Anderson) అనే 38 ఏళ్ల వ్యక్తి.. 2017 సంవత్సరంలో దీనిని స్థాపించాడు. మానవ నిర్మిత విపత్తులను (Man Made Disasters) వెలికితీయడమే దీని పని. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవలందిస్తుంటోంది. ఆయా కంపెనీల్లో ఫ్రాడ్స్, దుర్వినియోగం, సీక్రెట్ కార్యకలాపాలు, ఇతర మోసాలను గుర్తించి నివేదికలు వదులుతుంది. అంతే కాదండోయ్.. అదే కంపెనీని టార్గెట్ చేసి.. షార్ట్ సెల్లింగ్ చేసి సవాల్ చేస్తోంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌లో చాలా రకాలే ఉంటాయి. ముందు షేర్లను కొని పెరిగాక అమ్మడం చేస్తుంటారు. ఇది ఇంట్రాడే, డెలివరీ అని రెండు విధాలుగా చేయొచ్చు. అయితే షేర్లు ఎక్కువ ధర వద్ద విక్రయించి.. పతనమయ్యాక అంటే ధర తగ్గాక కొని ట్రేడింగ్‌ను ముగించి లాభాలు సొమ్ముచేసుకోవచ్చు. దీనిని షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఏదైనా స్టాక్ పడిపోతుందని భావిస్తే.. ఈ షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ విలువ దగ్గర తొలుత విక్రయించి.. షేరు విలువ పడిపోయాక తిరిగి కొని ట్రేడింగ్ చేయొచ్చు.
ఈ హిండెన్‌బర్గ్ కూడా అదే చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా.. ఇలాంటి రిపోర్ట్‌లు ఇచ్చే ముందు సదరు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. అప్పుడు ఎలాగూ స్టాక్ ధర పడిపోతుందని తెలుసో? లేదా పడిపోయేలా చేయడమో? చేసి లాభాలు ఆర్జిస్తుంటుంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదల చేసే ముందు కూడా అందులో ఇన్వెస్ట్ చేసి కోట్లు దండుకొని ఉండొచ్చని తెలుస్తోంది.
నాథన్ అండర్సన్ ఎవరు?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ స్థాపకుడు నాథన్ అండర్సన్ గురించి చాలా వివరాలు బయటికి రావు. తెలియవు. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టివిటీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ పట్టా పొందాడు. ఆ తర్వాత కొన్నేళ్లు ఇజ్రాయెల్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత అమెరికాలోని ఒక డేటా కంపెనీలో ఫ్యాక్ట్‌సెట్ రీసెర్చ్ సిస్టమ్స్ కంపెనీలో పనిచేశాడు. ఎక్కడ పనిచేసినా.. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పనే చేశాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా పనిచేయడం ఎలానో నేర్చుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత హిండెన్‌బర్గ్‌ను స్థాపించి పలు కంపెనీల గుట్టు విప్పుతున్నాడు.
ఏదైనా కంపెనీని లక్ష్యంగా చేసుకుంటే.. మొదట 6 నెలలు.. పబ్లిక్ రికార్డ్స్, ఇంటర్నల్ కార్పొరేట్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించాక.. ఆ కంపెనీలో పనిచేసే, అంతకుముందు పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడి, దేశవిదేశాలు తిరిగి సమాచారం సేకరిస్తుంటుంది. ఇక షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకొని ఒక్కసారిగా రిపోర్ట్ వదిలి.. లాభాలను సొంతం చేసుకుంటుంది.
గూగుల్ ఉద్యోగి కన్నీటి గాథ.. క్యాన్సర్‌తో అమ్మ చనిపోయిందని తెలిసినా..
మంచి ట్రాక్ రికార్డు..
2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్‌ను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇలానే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక ఆ కంపెనీలో ఫ్రాడ్స్ బయటపడటంతో కంపెనీ స్టాక్ విలువ ఏకంగా 40 శాతం వరకు పతనమైంది. అమెరికా ఎస్‌ఈసీ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆ కంపెనీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. మొత్తంగా ఇప్పటివరకు 16 కంపెనీల్లో ఇలా ఇన్వెస్టిగేషన్ చేసింది. జర్మనీకి ఒక ఒక ప్యాసింజర్ ఎయిర్‌షిప్ పేరు హిండెన్‌బర్గ్. 1937లో ఇది ప్రమాదానికి గురైంది. ఈ విపత్తులో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మానవుడి నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని, అందుకే తన కంపెనీకి అదే పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు నాథన్ అండర్సన్.