పోలీస్ అధికారి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిషా మంత్రి నవకిశోర్ దాస్ మరణించారు. భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉదయం మంత్రి కిషోర్ దాస్ పై ఏఎస్సీ గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆదివారం ఝూర్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న నవకిశోర్.. తన కారును దిగుతున్న సమయంలో ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రిపై కాల్పుల ఘటన ఒడిషాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిజూ జనతాదళ్ (బీజేడీ)లో సీనియర్ నేత అయిన నవకిశోర్ దాస్ అప్పట్లో మహారాష్ట్రలోని ప్రఖ్యాత శనిసింగణాపూర్ దేవాలయానికి కోటికి పైగా విలువైన ఆభరణాలు సమర్పించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.