మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. మన శరీరంలో తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. ఐరన్ లోపించడం వల్ల నీరసం, తల తిరిగినట్టు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోయినట్టు ఉండడం, జుట్టు రాలడం, రక్తహీనత, డిఫ్రెషన్, తలనొప్పి , గోర్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు ఐరన్ ట్యాబ్లెట్స్ ను ఉపయోగించమని చెబుతున్నారు. కేవలం మందుల వల్ల ద్వారా మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా ఐరన్ మన శరీరానికి లభిస్తుంది. సాధారణంగా పురుషులకు రోజుకు 10 మిల్లీ గ్రాములు, స్త్రీలకు రోజుకు 29 మిల్లీ గ్రాములు, గర్భిణీ స్త్రీలకు రోజుకు 27 మిల్లీ గ్రాములు, బాలింతలకు రోజుకు 23 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది.
సహజ సిద్ద పదార్థాల ద్వారా లభించే ఐరన్ శరీరంలో ఎక్కువైనప్పటికి ఎటువంటి హాని కలగదు. కానీ క్యాప్సుల్స్ ద్వారా తీసుకునే ఐరన్ ఎక్కువైతే ఇతర దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. ఒక్కో క్యాప్సుల్ లో 32 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఐరన్ క్యాప్సుల్స్ ను ఎక్కువగా వాడడం వల్ల మలం గట్టిగా రావడం, మలం నల్లగా రావడం, కడుపులో నొప్పి, తలనొప్పి, నోట్లో రుచి మారడం, చర్మం ఎర్రగా మారడం, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం ఐరన్ ఎక్కువగా ఉండే సహజ సిద్ద పదార్థాలను తీసుకోవడమే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు అనేకం ఉన్నాయి. కొత్తిమీర – 5.3 మిల్లీ గ్రాములు, కరివేపాకు – 8.6 మిల్లీ గ్రాములు, ధనియాలు -17.6 మిల్లీ గ్రాములు, ఆవాలు – 13 మిల్లీ గ్రాములు, నల్ల నువ్వులు – 13 మిల్లీ గ్రాములు, తెల్ల నువ్వులు – 15 మిల్లీ గ్రాములు, అవిసె గింజలు – 5.4 మిల్లీ గ్రాములు, ఉలవలు – 8 మిల్లీ గ్రాములు, మిరియాలు – 12 మిల్లీ గ్రాములు, వాము – 13.6 మిల్లీ గ్రాములు, ఇంగువ – 15 మిల్లీ గ్రాములు, జీలకర్ర – 20.5 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.