Sports

సానియా మీర్జాపై సజ్జనార్‌ సీరియస్‌.. సెలబ్రిటీలు అలాంటి పనులు చేయవద్దంటూ

సానియా మీర్జాపై సజ్జనార్‌ సీరియస్‌.. సెలబ్రిటీలు అలాంటి పనులు చేయవద్దంటూ

ప్రస్తుతం నడిచేది సోషల్‌ మీడియా యుగం. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు వరకు అందరూ సోషల్‌ మీడియాకు దాసులే. తమ మనసులోని భావాలను పదుగురితో పంచుకోవాలన్నా.. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండాలన్నా.. అందుకు సరైన వేదిక సోషల్‌ మీడియానే. సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటం ఎంతో అవసరం. కానీ కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు కూడా సోషల్‌ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఒకరు.

సజ్జనార్‌ సోషల్‌ మీడియా.. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆర్టీసికి సంబంధించి ఎలాంటి సమాచారం అయినా.. సమస్యలైనా సరే.. ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటూ.. పరిష్కారం చూపుతూ ఉంటారు సజ్జనార్‌. అప్పుడప్పుడు సామాజిక అంశాలపై కూడా పోస్ట్‌లు పెడుతుంటాడు సజ్జనార్‌. ఈ క్రమంలో తాజాగా సజ్జనార్‌ చేసిన ట్వీట్‌ ఒకటి వైరలవుతోంది. టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాపై ట్విట్టర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశారు సజ్జనార్‌. మరి ఇంతకు సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి

సానియా మీర్జా చేపట్టిన ఓ క్యాంపెయిన్‌ను.. ట్విట్టర్‌ వేదికగా తప్పు పట్టారు సజ్జనార్‌. సెలబ్రిటీలు మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రచారం చేయవద్దని, ఇలాంటి సంస్థల వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని సూచించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌.. ‘‘నేను సెలబ్రిటీలందరికి ఒకటే మనవి చేస్తున్నాను.. క్యూనెట్‌, అలాంటి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీను ప్రమోట్‌, సపోర్ట్‌ చేయవద్దని కోరుతున్నాను. ఇలాంటి మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ కంపెనీలు.. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇలాంటి దురదృష్టకర సంఘటన వెలుగు చూసింది’’ అంటూ సానియా మీర్జాను ట్యాగ్‌ చేశారు సజ్జనార్‌ ప్రముఖ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్‌కు సానియా మీర్జా ప్రచారం చేస్తున్నారు. దీన్ని తప్పుబట్టిన సజ్జనార్.. అసలు సెలబ్రెటీలు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు.
గతంలో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్ సంస్ధపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థల్లో సోదాలు జరిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమందిని అరెస్ట్ చేశారు. అంతేకాక ఆ సంస్ధకు చెందిన బ్యాంకుల్లోని రూ.కోట్ల నగదును కూడా ఫ్రీజ్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు.. క్యూనెట్ సంస్ధ మళ్లీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఇటీవల ఆ సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణలు రావడంతో.. ఆ కంపెనీ కార్యాలయాలతో పాటు క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో సజ్జనార్ ఇలా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి సజ్జనార్‌ చేసిన ట్వీట్‌ కరెక్టే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి