కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు..
అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు.
ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.