ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ టిక్కెట్ల కోసం డిమాండ్ ఏర్పడింది.
టీడీపీలోని యువ నేతలు, సీనియర్ నేతలకు తోడు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా టిక్కెట్ మాదేనంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నేను టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఓ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నేరుగా ప్రకటించుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లోనే విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలోనే టీడీపీ టిక్కెట్లపై ఇంత ప్రచారం జరుగుతూంటే.. ఇక టీడీపీలో ఉంటూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పని చేస్తున్న నేతల మధ్య ఇంకెంత పోటీ ఉండాలి…? ఇటీవలి కాలంలో పాత నేతలు కూడా పెద్ద ఎత్తున యాక్టివ్ కావడం.. యువ నేతలు దూకుడుగా ఉండటంతో టీడీపీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్రమయింది.
టీడీపీలో పెరిగిన జోష్ !
తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకూ ఉన్న నైరాశ్యం స్థానంలో ఉత్సాహం వచ్చింది . కేసుల భయాన్ని పూర్తిగా వదిలేసి నేతలంతా రోడ్లపైకి వస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర కావడంతో టిక్కెట్ ఖరారు చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్లు ఆశించే వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇంకా ఏడాది సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల సమరానికి సై అంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడంతో మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా రు. ఒకవైపు జిల్లాల పర్యటనతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న చంద్రబాబు మరోవైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ, లోకేష్ ప్రయత్నాలు !
తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఒకవైపు అధినేత చంద్రబాబు, మరోవైపు యువనేత లోకేష్‌లు శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తం గా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లుగా భావిస్తున్న ఆ పార్టీ నేతలు టికెట్ల కోసం అధిష్టానం ముందు క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని ముఖ్య నేతల నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులు టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టా నం దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతూ నియోజక వర్గాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాగా వేస్తున్నారు.
యాక్టివ్ అవుతున్న సీనియర్ నేతలు – పోటీకొచ్చిన యువనేతలు
ఇప్పటివరకు మౌనంగా, పార్టీకి దూరంగా ఉంటున్న కొందరు నేతలు మళ్లిd తమతమ నియోజకవర్గాల్లో బిజీ అవుతూ ఉన్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టిలో పడ్డారు. నియోజకవర్గాల్లో తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా వీరికి కొంత అనుకూ లమైన సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో యువనేతలు కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. కేసులకు, దాడులకు బెదరకుండా అధికార పక్షానికి ధీటైన జవాబిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే 158 నియోజక వర్గాల సమీక్షలను పూర్తి చేశారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపైనా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్దోంది.