విధి చేయు వింతలన్నీ
మతి లేని చేతలేనని..
విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో..
కొన్ని ప్రత్యేకమైన గీతాలను
సుమధురగళంతో
ఆలపించి మైమరపించిన
కోయిలమ్మ ఇక సెలవంటూ
మరలిరాని లోకాలకు
మరలిపోయింది..!
నేనా పాడనా పాటా..
మీరా అన్నదీ మాట..
ఆ గొంతులో ఎంత బిడియం
సిగ్గు పడుతూనే
మొగ్గలు పూయించింది..
తెరలు తెరలుగా
సురను కురిపించింది..!
పేరులోనే వాణిని పొదుగుకున్న మధురవాణి..
స్వరరాణి..సుమధుర బాణి..
మాధుర్యానికి
తన స్వరమే వాకిలై..
భువికి దిగివచ్చిన ఎలకోయిలై..
వదనం భూపాలమై..
హృదయం ధృవతాళమై..
సహనం సాహిత్యమై..
పాడిందే సంగీతమై..
ఆ సంగీతమే
తన ఇంగితమై..అవగతమై
మనోహర గీతమై..
గొప్ప గతమై..
ఇప్పుడామె మరణమే
మానని గాయమై…
విషాద గేయమై..!
పతి మాట దాటని సతి..
జయరాముడే
ఆనతినీయగా..
సమ్మతినీయగా
సన్నుతి చేయగా..
ఉడకని అన్నానికి
ఆయనకొచ్చే అను’రాగానికి’
ఏ రాగం బాగుండునో
చెప్పే త్యాగయ్య ఆయనేగా!
అలా..అలలా..
కలలా..పాటల వలలా
మిగిలిపోయింది ఎప్పటికీ
వాణీజయరాముగా..
పాడుతూ గోముగా..!
భక్తి గీతాలు..
ప్రేమ పాటలు..
కృతులు..జతులు..
సంగతులు…
అన్ని ప్రక్రియలూ
క్రమం తప్పక…
సంక్రమం చేయక..
సంగీతమే భాషగా..
గుండె ఘోషగా
పదివేల గీతాలను
ఆలపించిన మధురగాయని
పరుపులు పరచిన ఇసుకతిన్నెలకు..
పాటలు పాడిన
సందె గాలులకు..
దీవెన జల్లులు
జల్లిన అలలకు..
కోటి దండాలంటూ..
ఆనతి నీయమని
హరుని వేడుతూ..
నీ ఆన లేనిదే గ్రహింపజాలున
వేదాల వాణితో విశ్వనాటకం..
నీ సైగ కానిదే జగాన సాగునా
అయోగమాయ
..అని వేడుతూ ఇక వెడుతున్నానంటూ..
గొంతును తనతో గొంపోయి
మధుర తంత్రులను
మన కోసం విడిచి వెళ్లిపోయింది..
ఆనతినీయరా అచలనాట
అర్చింతునంటూ..
వెళ్ళిపోయింది
గంధర్వలోకానికి..
అక్కడి నుంచే
వచ్చింది గనక..
లేక కినుక…
ఇలకు మిగిల్చి
దశసహస్ర గీతాల కానుక..!
🎼🎼🎼🎼🎼🎼🎼