ఆ పార్టీలో అసమ్మతి నానాటికి పెరుగుతోంది. కిందిస్థాయి నుంచి పై వరకు ఒకటే పరిస్థితి. ఇన్నాళ్ల నమ్మకం నట్టేట మునిగింది. ఎన్నికల ఖర్చులు కూడా వెనక్కిరాని స్థితి. లబోదిబోమని ఏడ్వమొక్కటే తక్కువ. ఎప్పుడూ లేని ఈ దుస్థితికి కారణమేంటి ? ఎందుకిలా జరుగుతోంది ? స‌్టోరీలో తెలుసుకోండి
ఏపీలో అధికారపార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అధిష్టాన వైఖరి పై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఇదే అసంతృప్తి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. అందుకోసం ఉన్నదీ .. లేనిదీ ఊడ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టారు. అన్న వస్తే మన ఇబ్బందులు తీరుతాయని భావించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతోంది. కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదు.
గెలిచిన తర్వాత పేరుకు మాత్రం కార్యకర్తలకు కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ ఒక్క పైసా కూడా బిల్లు చెల్లించలేదు. ఏపీ వ్యాప్తంగా 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా ఇదే. సొంతపార్టీ వారికే బిల్లులు చెల్లించిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలకు చెల్లిస్తుందా ? అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఇంతటి దుస్థితి ఎన్నడూ లేదని చెప్పవచ్చు.
ఇంతటి దుస్థితికి కారణం ఒక పనికి చెల్లించాల్సిన డబ్బును మరొక పనికి ఉపయోగించడం. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను .. ఆ పనులకు కేటాయించకుండా మరొక అవసరానికి వినియోగించడం. దీని వల్ల ఆ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల రూపంలోని కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించినా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరిగి.. కాంట్రాక్టులో వచ్చే లాభం కూడా నష్టంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీ కార్యకర్తల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మొహందాచుకుని బతుకుతున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని తేల్చిపడేశారు. కార్యకర్తలు నిలదీసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే కన్నబాబు ప్రాధాన్యం ఇవ్వలేదని సర్పవరం ఆలయ చైర్మన్, ఆయన సతీమణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీని బట్టి చూస్తే వైసీపీలో నేతలు, కార్యకర్తల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ కార్యకర్తల బాధలు తీరకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోరపరాభవం తప్పదు. పోలింగ్ బూత్ వద్దకి ఓటరును తీసుకొచ్చి ఓటేయించే పరిస్థితి లేకపోతే ఆ పార్టీకి గెలుపు అసాధ్యం. వరుస ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, కార్యకర్తల అసంతృప్తి కలిసి వైసీపీ పడవను ఏ ఒడ్డుకు తీసుకెళ్తుందో వేచిచూడాలి. ఇప్పటి వరకు అయితే మొత్తం నలుగురు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. ఇంకెందరు ఉన్నారో చూడాలి.