అమెరికాలో ఖమ్మం జిల్లా వాసి అఖిల్ సాయి మృతి కేసు మరో మలుపు తిరిగింది. అఖిల్ శ్రావిక్ సాయి (22) చనిపోయింది మిస్ ఫైర్‌లో కాదని.. తోటి విద్యార్థే తుపాకీతో కాల్చి చంపాడని తేలింది. అయితే ఎందుకు చంపాడు..? అసలు ఆ రివాల్వర్ ఎక్కడినుంచి వచ్చింది..? వ్యక్తిగత కారణాలతోనే చంపాడా? ఇంకేదైనా రీజన్ ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన యువకుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే, ముందుగా మిస్ ఫైర్ అయి గాయాలయ్యాయని.. తల్లిదండ్రులకు సమాచారం అందింది.. ఆ తర్వాత చనిపోయాడని తెలిసింది. చివరకు తోటి విద్యార్థే కాల్చి చంపాడని పేర్కొంటుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ సాయి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర. అఖిల్ సాయి చనిపోయాడనే వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మిస్‌ఫైర్ అయిందని.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడన్న సమాచారం అందిందని అఖిల్ తండ్రి విలపిస్తున్నారు. తన బిడ్డ మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విఙ్ఞప్తి చేశాడు.
అమెరికాలోని అలభామ సిటీలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ అయి సోమవారం అఖిల్ సాయి తీవ్రంగా గాయపడ్డాడని.. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందించింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఫోన్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. మధిర నివాసి మహంకాళి అఖిల్ అమెరికాలో అభర్న్ యూనివర్సిటీ లో ఎమ్మెస్ చదివేందుకు ఏడాది క్రితం అమెరికా వెళ్లాడు.. సాయి తల్లిదండ్రులు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. కాగా.. చేతికొచ్చిన కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
కాగా, ఈ ఘటన జరిగినప్పుడూ అక్కడే ఉన్న అనుమానితుడు 23 ఏళ్ల రవితేజ గోలీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.