Politics

ప్రజాధనం వృధా చేస్తుంటే ప్రశ్నిద్దామా?, ఊరుకుందామా??

ప్రజాధనం వృధా చేస్తుంటే ప్రశ్నిద్దామా?, ఊరుకుందామా??

సీఎం తన మకాం ఎక్కడికి మార్చుకున్న ఇబ్బందేమీ లేదు… అధికారులు ఆయనతో వెళ్లడానికి వీలు లేదు

కస్టోడియల్ టార్చర్ కేసు ఈనెల 22 కు వాయిదా

కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు

తప్పుడు సర్కులేషన్ తో అడ్వర్టైజ్మెంట్ లు పొందుతున్న సాక్షి దినపత్రిక

వాయిస్ రికార్డింగ్ కూడా ఒక నేరమే

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర రాజధాని అంశం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉండి అయిన ముఖ్యమంత్రి
పరిపాలన సాగించవచ్చునని, అయితే ఆయనతో అధికారులంతా వెళ్లడానికి నిబంధనలు అంగీకరించవని తెలిపారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం 2014 లోని సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు రాజ్యసభలో తమ పార్టీ సభ్యుడు విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానాన్ని కేంద్రమంత్రి ఇచ్చారన్నారు. రాజధాని అంశంపై , సుప్రీంకోర్టులోను, కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిందని వెల్లడించారు. రాజధానిగా నిర్ణయించిన అమరావతి ప్రాంతంలో సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణానికి 2, 500 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినట్లు కేంద్రం తెలియజేసిందన్నారు . తమ అనుమతి లేకుండానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొనట్లు రఘురామకృష్ణం రాజు వివరించారు. మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర హైకోర్టు కొట్టి వేయగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడమే కాకుండా, ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడితే, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వెల్లడించినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రతిపాదించారని, అసెంబ్లీలో క్షవరం చేయడానికి వీలు లేదన్నారు. తమ పార్టీ నేతల మాటల్లో పసలేదని, నస మాత్రమే ఉందని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై తమకు అధికారం లేదంటూ తమ పార్టీ నేతలు శోకాలు పెట్టడం ఎబ్బెట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పార్లమెంటులో చేసిన చట్టానికి, అసెంబ్లీలో సవరణకు ఆస్కారం లేదన్న విషయం తమ పార్టీ నేతలకు తెలియదా? అంటూ రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించాలని కోరుతూ, గతంలో రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించిన విజయసాయి రెడ్డే , ఈ ప్రశ్నను అడిగినందుకు అభినందనలు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణంరాజు అన్నారు . రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని ఈనాడు దినపత్రికలో వార్తా కథనాన్ని ప్రచూరించగా, సాక్షి దినపత్రికలో మాత్రం మాకు సంబంధం లేదు అని కేంద్రం అన్నట్లుగా వార్తా కథనాన్ని ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. మాకు సంబంధం లేకుండా మూడు రాజధానులను ఏర్పాటు చేశారని కేంద్రం చెబితే, రాజధాని తో మాకు సంబంధం లేదన్నట్టు గా వార్త రాస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఇవేనా జర్నలిజం విలువలని, ఇలాంటి తప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూస్తున్న సాక్షి దినపత్రిక లైసెన్స్ రద్దు చేయాలన్నారు.

ఈ భూమి పుట్టాక ఇంతలా అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని చూడలేదు

ఈ భూమి పుట్టాక ఇంతలా అబద్దాలను చెప్పే ప్రభుత్వాన్ని తాను చూడలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఋషికొండను అహంకారంతో గుండు కొట్టినట్లు కొడుతూ, కోర్టులో కేసు విచారణకు రాకుండా వాయిదాలను వేయించుకుంటున్నారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇక ఉత్తుత్తి వార్నింగులు ఇప్పించుకుంటూ యదేచ్చగా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారన్నారు. టూరిజం పేరిట ఋషికొండపై నిర్మిస్తున్న భవనాలలో ముఖ్యమంత్రి కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ల కోసం వినియోగించనున్నారని తెలిపారు. ఋషికొండకు ఎదురుగానే కొండపై గతంలో భూమిని లీజుకు తీసుకొని హెల్త్ రిసార్ట్ పేరిట వెల్నెస్ సెంటర్ ను ఒక సంస్థ ఏర్పాటు చేయగా, దాన్ని తన సహ నిందితుడి ద్వారా కొనుగోలు చేయించిన ముఖ్యమంత్రి తన నివాస భవనంగా మార్చుకోనున్నారని తెలిపారు . ఋషి కొండ ఎదురుగానున్న కొండపై నుంచి ఋషికొండకు చేరుకోవడానికి టన్నెల్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. ఋషికొండకు పొరుగునే ఉన్న కేజీహెచ్ కాలనీ పడగొట్టి అధికారుల నివాస సముదాయంగా మార్చాలని భావిస్తున్నారన్నారు . అలాగే మరికొందరు అధికారులను విశాఖలోనే భవనాలను అద్దెకు తీసుకొని తనకు అందుబాటులో ఉండాలని ఆదేశించారన్నారు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో వీగిపోయిన, తాను మాత్రం విశాఖలోని మకాం వేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలిపారు. అధికారులంతా తనకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. రాజధాని లోని ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన అధికారులు, ముఖ్యమంత్రి ఎక్కడకు మకాం మార్చితే , అక్కడే విధులు నిర్వహించాలని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంత బాధ్యతారహితంగా తన స్వార్థం కోసం, మానసిక ఆనందం కోసం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తుంటే, ప్రశ్నిద్దామా?, ఊరుకుందామా?? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రజలను అడిగారు. రేపు రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఒక్కడే తప్ప, విశాఖకు ఆయన సెక్రటరీలు, ఇతర ప్రభుత్వ అధికారులు మకాం మార్చడానికి వీలు లేదని అమరావతి పరిరక్షణ సమితి, ప్రజాహితాన్ని కోరుకునే ఇతర నాయకులు అఫిడవిట్ దాఖలు చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు . రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబు?, ఈ విషయమై ప్రజలంతా ప్రశ్నించాలన్నారు . ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇక తమ ఆర్థిక అవసరాల నిమిత్తం వీ ఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన స్వార్ధ పూరిత ఆలోచనతో రాజధానిని కాదనుకొని, మరొక పట్టణానికి మకాం మారిస్తే, ఉద్యోగులంతా మకాం మార్చాలని ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

విశాఖకు మకాం మారిస్తే రెండో హెచ్ఆర్ఏ ఇస్తారా?

అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెచ్ఆర్ఏ ఇవ్వగా, ఇప్పుడు విశాఖకు మకాం మారిస్తే మరొక హెచ్ ఆర్ ఏ ఇస్తారా? అంటూ ముఖ్యమంత్రిని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లేకపోతే ముఖ్యమంత్రి తన జేబులో నుంచి డబ్బులు తీసి ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తారా అంటూనిలదీశారు. చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ఇంత విశ్రుంకలత్వం వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రెండు మూడేళ్ల క్రితం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు. హైకోర్టు తీర్పులో ఏదైతే ప్రస్తావించారో, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా తేటతెల్లం చేసిందన్నారు. విభజన చట్టం ప్రకారమే హైకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడడం సానుకూల పరిణామంగా రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఓ ముఖ్యమంత్రి ఎక్కడ కావాలంటే అక్కడ రాజధాని పెట్టుకో… అవసరమైతే సచివాలయాన్ని రద్దు చేసుకో అని రాజ్యాంగానికి భిన్నంగా కోర్టు తీర్పు ఉంటుందని తాను భావించడం లేదన్నారు.

ఋషికొండపై అక్రమ నిర్మాణాల ద్వారా ఇస్తున్న సంకేతాలు ఏమిటి

ప్రజా వేదిక కూల్చివేత సమయంలో అక్రమ నిర్మాణాల ద్వారా ప్రజలకు మనం ఇస్తున్న సంకేతాలు ఏమిటీ అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి
, మరి… ఇప్పుడు ఋషికొండపై అక్రమ నిర్మాణాల ద్వారా ఇస్తున్న సంకేతాలేమిటో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. న్యాయాన్ని కొద్ది రోజులు ఆపగలరు తప్ప…నిజాన్ని, న్యాయాన్ని శాశ్వతంగా ఎవరు ఆపలేరన్నారు. ఋషికొండపై ఎన్ని గ్రీన్ మ్యాట్లు పెట్టినా జరుగుతున్న ప్రకృతి విధ్వంసం పై పర్యావరణ ప్రేమికులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారుస్తున్నాడంటే, విశాఖలో మనుషుల కంటే ఎక్కువగా వృక్షాలు రోధిస్తున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటికే విశాఖలో వేల వృక్షాలు నేలకొరిగాయని, ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారిస్తే ఉన్న చెట్లన్ని నేలకూలడం ఖాయమన్నారు.

కస్టోడియల్ టార్చర్ దోషులు
వెలుగులోకి రావడం ఖాయం

గత రెండేళ్ల క్రితం ఏపీ సి ఐ డి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని పోలీసు లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన విషయం ప్రజలందరికీ తెలుసునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తనని పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడాన్ని సవాల్ చేస్తూ తన కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. అయితే, ఈ కేసు ఒకటిన్నర సంవత్సరాల పాటు విచారణకు రాలేదన్నారు. అయితే ఇటీవల హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు
సూచించిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని వెల్లడించారు. తన పిటీషన్ బెంచ్ స్వీకరించగానే, మరొక బెంచ్ కు కేసును బదిలీ చేశారన్నారు. ఈ కేసులో నోటీసులు జారీ చేసి, ఈనెల 22వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు. సిట్టింగ్ ఎంపీని అక్రమ కేసులు బనాయించి పుట్టినరోజు అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన సంఘటన స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు చోటు చేసుకో లేదన్నారు. వై ఎస్ వివేక హత్య కేసులో దోషులు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నట్లుగానే, తనని లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన వారు, చూసి ఆనందించిన వారు బయటకు వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. తాను అరెస్టు అయిన వెంటనే క్షేమంగా బయటికి రావాలని ఎంతోమంది తనపై అభిమానం ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలను సమర్పించుకోవడం జరిగిందని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని, అటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తమ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా తన ప్రాణ రక్షణకు అండగా నిలిచి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు లేఖ రాశారని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త వ్యక్తులకు నోటీసులు, అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానం గా రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

మంత్రి పదవికి లేని విద్యార్హత కళ్యాణ లక్ష్మికి ఎందుకు?

మంత్రి పదవికి లేని విద్యార్హత కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు ఎందుకని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పదవ తరగతి పాస్ అయిన వారికి మాత్రమే కళ్యాణ లక్ష్మికి అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మంత్రివర్గంలో 5, ఆరవ తరగతి చదివిన వారికి కూడా చోటు కల్పిస్తున్నప్పుడు, కళ్యాణ లక్ష్మి పథకాన్ని పొందాలి అంటే పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలన్న నిబంధనను విధించడం విడ్డూరంగా ఉందన్నారు. గత నాలుగేళ్లలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఒక్క లబ్ధిదారునికి కూడా నయా పైసా మంజూరు చేయలేదన్నారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారికి కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం, సాధారణ ప్రజలను మభ్యపెట్టడానికి రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఈ పథకానికి భూమి బద్దలు అయ్యేలా ప్రచారం చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని, తాము లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పడం పరిశీలిస్తే, రాని లక్ష కన్నా, వచ్చిన 50 వేల రూపాయలే సుఖమని లబ్ధిదారులు అనుకుంటారన్నారు.

ప్రభుత్వ జీవోలను సమీక్షించాలి

సాక్షి దినపత్రిక యాజమాన్యం తప్పుడు సర్కులేషన్ నివేదికలను చూపించి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లను పొందుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వాలంటీర్లను, ప్రభుత్వ ఉద్యోగులను విధిగా సాక్షి దినపత్రిక కొనుగోలు చేయమని జీవోలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, మూడు లక్షల వాలంటీర్లు, లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసిన సాక్షి దినపత్రికతో తమ సర్కులేషన్ ను పెంచి చూపించుకొని ప్రభుత్వ ప్రకటనలు పొందుతుందని తెలిపారు. ఇక సర్కులేషన్ ఎక్కువ ఉన్న పత్రికలకే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్న నిబంధనను తీసుకువచ్చి, తప్పుడు సర్కులేషన్ నివేదికలను చూపించి సాక్షి దినపత్రిక యాజమాన్యం అడ్వర్టైజ్మెంట్ లను తీసుకుంటుందని ఒక మీడియా సంస్థ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సమీక్షించాలని కోరింది.

సీతారామాంజనేయులు కు కోటంరెడ్డి వాయిస్ రికార్డింగ్ పంపింది ఎవరు?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ రికార్డింగ్ తప్ప, ఫోన్ టాపింగు కాదని ఆయన స్నేహితుడైన వ్యక్తి పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాయని మచ్చ అవుతుందనే ఉద్దేశంతోనే తాను బయటకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ కు సీతా రామాంజనేయులు అనే పోలీసు అధికారి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని, మరి సీతారామాంజనేయులు కు ఆ మెసేజ్ ఎవరు పంపారన్న దానికి సమాధానం లేదన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలనే ఆయన కు పంపి సంజాయిషీ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగే కాదు… రికార్డింగ్ కూడా నేరమేనని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అద్భుతమైన కట్టు కథను చెప్పేటప్పుడు, దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా ఉండాలని, అవసరమైతే ఒక సినీ రైటర్ ని సలహాదారునిగా నియమించుకొని క్యాబినెట్ హోదా కల్పించాలని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.