Politics

సినీ ఇండస్ట్రీలోకి ఏపీ మంత్రి విడదల రజిని!

సినీ ఇండస్ట్రీలోకి ఏపీ మంత్రి విడదల రజిని!

సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ ఏదైనా గానీ రాజకీయాల్లో ఉన్న గాలి.. సినిమాల వైపు మల్లడం అనేది సహజం. తాజాగా ఏపీ మంత్రి విడదల రజిని సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు విడదల రజిని ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒక బ్యానర్ ను కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో కథా చర్చల కోసం ఒక సినిమా ఆఫీసుని కూడా తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడదల రజిని తమ బ్యానర్ లో ఓ కథను సిద్ధం చేశారట. త్వరలోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం. హీరో, హీరోయిన్ ఎవరు? దర్శకుడు ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ ఏపీ మంత్రి టాలీవుడ్ ఎంట్రీ అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి విడదల రజిని అధికారికంగా దీని గురించి ప్రకటన ఇస్తారో లేక తెర వెనుక ఉండి నడిపిస్తారో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విడదల రజిని.. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన మంత్రివర్గ పునః వ్యవస్థీకరణలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు. మరి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న విడదల రజిని టాలీవుడ్ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.