Devotional

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

భారీగా తరలి రానున్న భక్తులు

నంద్యాల/శ్రీశైలం, ఫిబ్రవరి 10: ఇల కైలాసంగా భావించే శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్నారు. తొలి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరి పూజ చేస్తారు. తర్వాతి రోజు నుంచి స్వామి అమ్మవార్లకు రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. పదోరోజు యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి, చివరి రోజు అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు వివిధ దేవస్థానాల నుంచి పట్టు వస్త్రాలను అందజేస్తారు. 11న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం, 13న విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, 14వ తేదీ ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, ఇదే రోజు సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు అందజేస్తారు. ఇక 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనుంది.