దేశంలో 59శాతం భూభాగానికి భూకంప ముప్పు.. లిస్ట్‌లో ఆ పెద్ద నగరాలు కూడా..
తుర్కియే, సిరియాలో భూప్రళయంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
– మరి మన దేశంలో భూకంపం సంభవించే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏఏ ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
★ ప్రకృతి విలయంతో తుర్కియే, సిరియా అతాలకుతలమయ్యాయి.
★ అత్యంత శక్తిమంతమైన ఈ భూప్రళయం.. తీవ్ర నష్టాన్ని, పెను విషాదాన్ని మిగిల్చింది.
★ నెల రోజుల క్రితం భారత్‌లోని దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేయాయి.
★ తుర్కియే విపత్తు నేపథ్యంలో భారత్‌కు భూకంపాల ముప్పు ఉందా? ఏయే ప్రాంతాలకు ఆ ప్రమాదం పొంచి ఉంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
★ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
★ మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోతోంది.
★ గతంలో సంభవించిన భూకంపాల ఆధారంగా.. దేశంలోని ప్రాంతాలను నాలుగు భూకంప మండలాలుగా వర్గీకరించారు. అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. వీటిలో జోన్ 5 భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం కాగా.. జోన్ 2 తక్కువ తీవ్రత కలిగిన ప్రాంతంగా పేర్కొన్నారు.
★ భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో 11 శాతం అత్యంత తీవ్రత కలిగిన జోన్ 5లో ఉంది.
★ జోన్ 4లో 18శాతం, జోన్ 3లో 30శాతం, జోన్ 2లో 41శాతం ఉన్నట్లు 2021లో కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో వెల్లడించారు.
జోన్ 5:
భూకంపాల ముప్పు అత్యధికంగా ఉన్న జోన్ ఇది. కశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బిహార్, మధ్య బిహార్, ఈశాన్య భారత్ ప్రాతాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. దీన్ని వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్‌గా పిలుస్తారు.
జోన్ 4:
ఇది హై డ్యామేజ్ రిస్క్ జోన్. దేశ రాజధాని దిల్లీ సహా జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఉత్తర పంజాబ్, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని ప్రధాన భూభాగాలు, ఉత్తర బెంగాల్, సుందర్బన్ ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి.
జోన్ 3: ఇది మధ్యస్థ ప్రభావం కలిగిన జోన్. చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్ లాంటి ప్రధాన నగరాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.
జోన్ 2:
ఇది స్వల్ప తీవ్రత కలిగిన జోన్. ఈ ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తిరుచిరాపల్లి, బులంద్‌షహార్, మోరదాబాద్, గోరఖ్‌పూర్, చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాది భూభాగాలు ఈ జోన్‌లో ఉన్నాయి.
★ ప్రస్తుతం సవరించిన భూకంప ప్రమాద మండలాల వర్గీకరణలో ‘జోన్ 1’ అనేదాన్ని ఉపయోగించలేదు. అందువల్ల ఏ ప్రాంతాన్నీ జోన్ 1గా గుర్తించలేదు.
★ భారత్ కూడా అత్యంత శక్తిమంతమైన భూకంపాలను చవిచూసింది. 2001లో చోటుచేసుకున్న భుజ్ భూకంపం, 1993లో సంభవించిన లాతూర్ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే, మన దేశంలో భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
★ సాధారణంగా భూకంపాలు సంభవించినప్పుడు భవనాలు కుప్పకూలి అధిక ప్రాణనష్టం కలుగుతుంది. దాన్ని నివారించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
★ భవనాలు, ఇతర మౌలిక సదుపాయలను నిర్మించేప్పుడు ప్రభుత్వం విధించిన కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
★ భూకంప నిరోధక నిర్మాణానికి సంబంధించి భారతీయ ప్రమాణాల జాబితా కూడా ఉంది.
★ ఇది నిర్మాణాల రూపకల్పన, భవనాల మరమ్మతు, పటిష్టతలపై సూచనలు చేస్తుంటుంది.
★ ఏదేమైనా.. ప్రకృతి విపత్తులు ఈ సమయానికి వస్తాయని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యంకాని పని. అందువల్ల, అలాంటి విపత్తుల సమయంలో తీవ్ర నష్టం కలగకుండా ముందు నుంచే సన్నద్ధత అవసరమని నిపుణులు చెబుతున్నారు.