తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటే పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై ప్రతిష్ఠాత్మక గ్రంథాలయాలకు చేరవేయాలన్నది బ్రిటన్‌లోని తెలంగాణ ప్రవాసుడు సురేశ్ గోపతి లక్ష్యం.
ఓ పుస్తకం ఇంట్లో ఉంటే కుటుంబమంతా చదువుతుంది. మహా అయితే బంధుమిత్రులు తిరగేస్తారు. అదే లైబ్రరీలో ఉంటే.. అందులోనూ బ్రిటిష్ రాయల్ లైబ్రరీలాంటి సెంట్రల్ లైబ్రరీలో ఉంటే.. వందలమందికి, వేలమందికి, లక్షలమందికి చేరుతుంది. కాబట్టే తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటే పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై ప్రతిష్ఠాత్మక గ్రంథాలయాలకు చేరవేయాలన్నది బ్రిటన్‌లోని తెలంగాణ ప్రవాసుడు సురేశ్ గోపతి లక్ష్యం.
‘నేను పుట్టింది హైదరాబాద్‌ల. తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండె. ఎట్ల గోస పడ్డం. రాష్ట్ర ఉద్యమం ఎట్లయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఏర్పడ్డది. సీఎం కేసీఆర్ సారు పాలనల రాష్ట్రం ఎట్ల తయారైంది.. ఇవన్నీ నాకు తెలుసు. మరి భవిష్యత్తు తరాలకు ఎట్ల తెలుస్తది?’.. ఈ ఒక్క ప్రశ్నే తనను ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసిందని చెబుతున్నారు సురేశ్ గోపతి. 50 దేశాల్లోని సెంట్రల్ లైబ్రరీలలో తెలంగాణ చరిత్ర పుస్తకాలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సురేశ్. ఇప్పటికే లండన్‌లోని బ్రిటిష్ రాయల్ లైబ్రరీలో తెలంగాణ చరిత్రను చాటే 25 పుస్తకాలను చేర్చారు. మరో నాలుగు దేశాల లైబ్రరీలలో చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నది. సురేశ్ గోపతి స్వస్థలం హైదరాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతం. 2001లో సీఎం కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలోనే సురేశ్ ఉపాధి కోసం లండన్ బాట పట్టారు. సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. మనిషి అక్కడున్నా.. మనసు మాత్రం తెలంగాణ ఉద్యమం చుట్టే తిరిగింది. ఎలాగైనా ఉద్యమంలో తనూ పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడి తెలంగాణ ఎన్నారై కమ్యూనిటీతో కలిసి బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు తెలంగాణకు మద్దతుగా అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సురేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి, పోరాట పటిమకు ఫిదా అయ్యారు. గొప్ప అభిమానిగా మారిపోయారు. ‘సార్ అంటే నాకు ప్రాణం.. అందుకే ఓసారి టీఆర్‌ఎస్ ప్లీనరీకి వచ్చినప్పుడు ఓ దిక్కు కారు బొమ్మ, ఇంకో దిక్కు సారు బొమ్మ ఉన్న గోల్డ్ కాయిన్ కేసీఆర్ గారికి ఇచ్చిన’ అని సురేశ్ చెప్పారు.
రేపటి తరాల కోసం
‘నా పిల్లలు లండన్‌లోనే పుట్టిండ్రు. బ్రిటన్ కల్చర్‌తోపాటు బోనాలు సహా మన తెలంగాణ పండుగన్నీ పరిచయం చేయించిన. తెలంగాణ చరిత్ర, సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమం గురించి మేము ఎంత చెప్పినా.. వారి మనసులోకి పూర్తిగా వెళ్లదు. తర్వాతి తరానికి వచ్చేసరికి తెలంగాణ గురించే మర్చిపోయే పరిస్థితి. ఈ ఊహే నేను భరించలేకపోయిన. యునైటెడ్ కింగ్‌డమ్ తెలంగాణ బిజినెస్ చాంబర్ (యూకేటీబీసీ) చైర్మన్ సీక చంద్రశేఖర్‌తో ఈ విషయంపై చర్చించిన. వచ్చే తరాలు కూడా తెలంగాణ చరిత్రను సమగ్రంగా తెలుసుకునేలా ఏం చేయాలె? అని ఇద్దరం ఆలోచించినం. స్వాతంత్య్ర పోరాటం మేమెవరం చూడలేదు. కానీ గాంధీ, నెహ్రూ, నేతాజీ పోరాడిండ్రని పుస్తకాల్లో చదివి తెలుసుకున్నం. ఇట్లనే తెలంగాణ సమగ్ర చరిత్రను వివరించే పుస్తకాలను విదేశీ లైబ్రరీల్లో పొందుపరుచాలని నిర్ణయించినం’ అని సురేశ్ గోపతి చెప్పుకొచ్చారు.
ఆగస్టు నాటికి..
‘స్విట్జర్లాండ్‌లోనో.. ఫ్రాన్స్‌లోనో.. జర్మనీలోనో ఉన్న తెలంగాణ బిడ్డ అక్కడి లైబ్రరీకి వెళ్లినప్పుడు తెలంగాణకు సంబంధించిన పుస్తకం కనిపిస్తే ఎంత సంతోషపడతడు? ఇప్పుడు మేం పొందుతున్న ఆనందం వాళ్ల మొఖంలో కూడా చూడాలని ఇద్దరం నిర్ణయించుకున్నం. అందుకే ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో తెలంగాణ పుస్తకాలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నం’ అని సురేశ్ తెలిపారు. ఆయన గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో నాలుగు సెట్ల తెలంగాణ చరిత్ర పుస్తకాలు (100 పుస్తకాలు), మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్ర, ఆయన రచనలకు సంబంధించిన ఒక సెట్ (10 పుస్తకాలు) సేకరించారు. మొత్తం 65 కిలోల పుస్తకాలను కొరియర్ ద్వారా బ్రిటన్‌కు పంపించారు. కేవలం కొరియర్ కోసమే రూ.35 వేలు ఖర్చు చేశారు. వీటిని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ లైబ్రరీల్లో చేర్చేందుకు ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి నెలా ఒక సెట్‌ను కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నానని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కనీసం 10 దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.‘మొత్తంగా 50 దేశాల
లైబ్రరీల్లో తెలంగాణ పుస్తకాలు ఉండాలన్నది మా లక్ష్యం. వాళ్లు వాటిని కనీసం వందేండ్లయినా కాపాడుతారు. అంటే మన చరిత్ర మరో వందేండ్లు భద్రంగా ఉన్నట్టే’ అంటారు సురేశ్. ఎవరైనా తన ప్రయత్నాన్ని మెచ్చుకున్నప్పుడు ‘తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ కష్టం ముందు.. రాష్ట్రం వచ్చినంక ఆయన పడుతున్న తపన ముందు మేం చేసిందెంత..’ అంటూ నవ్వేస్తారు. నిజమే కదా!
‘అక్షర’ సత్యం
తెలంగాణ చరిత్రను సమగ్రంగా వివరించేలా తెలంగాణ అకాడమీ 25 పుస్తకాలను ముద్రించింది. వీటిని విదేశాల్లోని లైబ్రరీలకు చేర్చాలని సురేశ్ గోపతి, సీక చంద్రశేఖర్
నిర్ణయించుకున్నారు. రెండేండ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు చెప్పగా, ఎంతో సంబురపడిపోయి సెట్ మొత్తం ఇప్పించారు. తిరిగి లండన్ వెళ్లేటప్పుడు తన దుస్తులన్నీ ఇక్కడే వదిలేసి లగేజీలో 15 కిలోలు కేవలం పుస్తకాలే తీసుకెళ్లారు సురేశ్. తనతోపాటు చంద్రశేఖర్, యూకేటీబీసీ కార్యదర్శి ప్రశాంత్ కటికనేని కలిసి వాటిని లండన్‌లోని బ్రిటిష్ రాయల్ లైబ్రరీలో ఇచ్చారు. ఇన్నిరోజులు బ్రిటిష్ లైబ్రరీలో ఎవరెవరిదో చరిత్ర ఉంది.. మన రాష్ట్ర చరిత్ర లేదే.. అని బాధపడ్డామని ఇప్పుడు ఏకంగా 25 తెలంగాణ పుస్తకాలు చదువుకోవచ్చని సంతోషంగా చెప్పారు సురేశ్. ఆ తర్వాత ‘కేసీఆర్: ద ఆర్ట్ ఆఫ్ పొలిటీషియన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్, తెలంగాణకు హరితహారం, పీవీ నరసింహారావు జీవిత చరిత్ర తదితర పుస్తకాలను సైతం బ్రిటిష్ లైబ్రరీకి చేర్చారు.