అక్లాండ్ : దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలానికి గురవుతోంది..అతలాకుతలమౌతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ద్వీప దేశాన్ని ముంచెత్తుతున్నాయి.
బలమైన ఈదురు గాలుల ప్రభావానికి చివురుటాకులా వణికిపోతోంది. అక్లాండ్ సహా పలు నగరాల తుఫాన్ బారిన పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా పలు చర్యలు తీసుకుంది.
ఈ తుఫాన్ పేరు గాబ్రియెల్లె. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో ఏర్పడింది. నార్త్ ఐలండ్ లోని అతి పెద్ద నగరం అక్లాండ్ వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాన్ తీరానికి తాకిన సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు రేడియో న్యూజిలాండ్ (ఆర్ఎన్‌జెడ్) తెలిపింది. సౌత్ ఐలండ్ పైనా దీని ప్రభావం కనిపించింది. వెల్లింగ్టన్, క్రైస్ట్ చర్చ్ సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అక్లాండ్ కు విమాన సర్వీసులను రద్దు చేశారు. అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలు రద్దయ్యాయి. న్యూజిలాండ్ నార్త్ ఐలండ్ లోని తీర ప్రాంత నగరాలు కోరమాండల్, గిస్ బోర్నె, విటియంగా, కువాటును, వైటై బే, ఒపిటో బే అల్లకల్లోలానికి గురయ్యాయి.
ఆయా నగరాల్లో బీచ్ లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించారు. విటియంగా, కోరమాండల్, గిస్ బోర్నె నగరాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులో ఉంచిన అక్లాండ్ కౌన్సిల్.. మిగిలిన వాటన్నింటినీ మూసివేసింది. అక్లాండ్ లో గల అన్ని పాఠశాలలు, యూనివర్శిటీలకు కౌన్సిల్ అధికారులు సెలవు ప్రకటించారు. నార్త్ అక్లాండ్ లో 15,000 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వెక్టార్ కంపెనీ తెలిపింది.
తీర ప్రాంత నగరాల నుంచి స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు అక్లాండ్ మేయర్ తెలిపారు. బలమైన ఈదురు గాలులు వీస్తోన్న కారణంగా ఆక్లాండ్ హార్బర్ బ్రిడ్జ్ ను మూసివేసినట్లు చెప్పారు. 24 గంటల తరువాత దీన్ని పునరుద్ధరిస్తామని వివరించారు. ఆక్లాండ్ లో రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేశామని కివి రైల్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. తీర ప్రాంతవాసుల కోసం 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ రూమ్, సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కోరమాండల్ సివిల్ డిఫెన్స్ కంట్రోలర్ గ్యారీ టేలర్ చెప్పారు.