NRI-NRT

తానా” ఎన్నికలు.. వాయిదా వేయాలని కొడాలి వర్గం. జరిపించాలని నిరంజన్ వర్గం TNI ప్రత్యేకం..

తానా” ఎన్నికలు.. వాయిదా వేయాలని కొడాలి వర్గం. జరిపించాలని నిరంజన్ వర్గం TNI ప్రత్యేకం..

ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంస్థగా పేరు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA )లో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్గాల పోరాటం, నేతల మధ్య కుమ్ములాటలు, ఆదిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తానా” లో అత్యధిక అధికారాలు ఉన్న బోర్డు షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిపించడానికి పది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది.నామినేషన్ల గడువు ముగియటానికి ఇంకా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయటానికి కొడాలి నరేన్ వర్గం, ఎన్నికలు జరిపించడానికి తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు వర్గం, తమ శక్తి యుక్తులను ప్రయోగిస్తున్నారు.

కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప…

ఎన్నికలు నిలిపివేయడానికి కొడాలి వర్గం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఎన్నికలు నిలిపివేయమని కోర్టు ఆదేశిస్తే తప్ప షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి తానా ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

నామినేషన్లకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు…

ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడంతో ఇరువర్గాలు నామినేషన్ లు వేయటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నిరంజన్ వర్గం నుండి ప్రస్తుత తానా కార్యదర్శి వేమూరి సతీష్ అధ్యక్షునిగా, ప్రస్తుత కోశాధికారి కొల్లా అశోక్ కార్యదర్శిగా, తూనుగుంట్ల శిరీష కోశాధికారిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మళ్లీ రంగంలోకి కొడాలి నరేన్…

గత ఎన్నికల్లో నిరంజన్ కు పోటీగా అధ్యక్ష పదవికి రంగంలోకి దిగి పరాజయం పాలైన ప్రొఫెసర్ కొడాలి నరేన్ ఈసారి మరల తానా అధ్యక్ష పదవికి రంగంలోకి దిగబోతున్నారు. ఆయన ప్యానల్ తరఫున కార్యదర్శి పదవికి మందలపు రవి పోటీలో ఉండబోతున్నట్లు సమాచారం. నరేన్ కు గాడ్ ఫాదర్ లుగా వ్యవహరిస్తున్న నాదెళ్ల గంగాధర్ వేమన సతీషులు ఈ పర్యాయం కూడా ఆయన తరపున రంగంలోకి దిగబోతున్నట్లు వినికిడి. వేమన సతీష్ ఆంధ్ర నుండి గత రాత్రి అమెరికాకు బయలుదేరాడు. గత ఎన్నికల్లో కొడాలి నరేనుకు బాహాటంగా మద్దతు ఇచ్చి న కోమటి జయరాం ప్రస్తుతం ఆంధ్రలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన వైఖరి పై స్పష్టత రాలేదు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి జై రామ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

“కలకలం రేపుతున్న కాకా”

తానాలో అధ్యక్ష పదవి తరువాత ప్రాముఖ్యత కలిగిన ఫౌండేషన్ చైర్మన్ హోదాలో ఉన్న యార్లగడ్డ వెంకటరమణ కూడా తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన పోటీలో ఉంటారా? ఆయన ఒక్కరే పోటీ చేస్తారా? సొంత ప్యానల్ తో రంగంలోకి దిగుతారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంధ్ర నుండి గత రాత్రి ఆయన అమెరికా చేరుకున్నారు.ఎన్నికలు రాజీమార్గంలో ఏకగ్రీవంగా జరగాలని తానా పెద్దలతో పాటు మెజారిటీ సభ్యులు కోరుకుంటున్నారు.ఎన్నికలు జరిగితే వర్గ పోరాటాలు ముదిరి తానా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

కిలారు ముద్దుకృష్ణ.
సీనియర్ జర్నలిస్ట్.