DailyDose

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం TNI ప్రత్యేక కథనం

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం TNI ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవమ్
~~~

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించబడుతుంది.

1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్‌లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.

తెలుగులో తొలి రేడియో ప్రసారాలు

తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్‌ 16న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది.

అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే.

రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్‌ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్‌ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్‌ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు.

ఆకాశవాణి కార్యక్రమాలు..

ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్‌ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్‌ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది.