నైటింగేలే గాని ఆడపులి!
తెల్లదొరలే ఆమెలో గాంధీని మించి ప్రమాదాన్ని చూస్తే..
అదే బాపూ ఆమెలో తన తెగువను కంటే..
ఆమె గర్జిస్తేనే
బ్రిటిష్ పాలకులు గడగడలాడితే..
ధైర్యానికి..ఘనకార్యానికి..
సాధనకు..శోధనకు..
మగువే తానుగా తెగువై..
ఓ మహోద్యమమే
స్త్రీ రూపు ధరిస్తే..
జాతి మొత్తం
ఆమెనే అనుసరిస్తే..
పోరాటమే స్త్రీగా అవతరిస్తే..
ఒక గొప్ప సమరానికి తాను నాయకత్వం వహించి తరిస్తే
ఇంక ఆమె..
సరోజిని నాయుడు గాక ఇంకెవరయ్యేది..
నైటింగేల్ ఆఫ్ ఇండియా..
జాతి మొత్తానికి
ఆ రోజుల్లో పట్టుకుంది
ఆమె నాయకత్వ మానియా..!!
గాంధీ..నెహ్రూ..
పటేల్..అజాద్..
ఇలా ఎందరో మగమహారాజులు..
ఒక్కోరు ఒక్కో కొదమసింహం
కొలువై..జాతికి పరువై
ముందు నిలిచిన
భరత జాతి ప్రాంగణంలో
దాస్య విమోచన సమరాంగణంలో..
మొదటి వరసలో..
సేనాపతి హోదాలో
నిలిచింది గోదాలో..
సరోజిని..సాహసానికి
పెట్టింది పేరు..
తెగువే ఆమె తీరు..!
పుట్టగానే పరిమిళించిన పువ్వు..పలుకు తేనె..
రాత బహురుచుల కలబోత
మధురమైన భాష..
ఉవ్వెత్తున ఎగసే గుండెఘోష
జైలు ఇల్లుగా..
స్వరాజ్యమే దిల్లుగా..
కవితలు నడివేసవిలో
చిరుజల్లుగా..
దేశం నడిబొడ్డులో
ఉద్యమాల గడ్డలో
ముందు నిలిచిన వీరనారి
ఆడరూపు దాల్చిన
సంగ్రామభేరి..!
తెలుగింటి కోడలు..
బెంగాలీల ఆడపడుచు..
తెల్లదొరలపై
బుసకొట్టిన కోడెత్రాచు..
నైటింగేలే గాని ఆవేశం వస్తే
గొంతు కంచు..
కవితలతో నిజామునే
మెప్పించిన ప్రతిభ..
రూపంలో
అద్భుతమైన ప్రతిమ..!
జాతి వేరని..
దేశం వేరని..నువ్వు వేరని..
విడిగా ఉండకు..
నీకు జరిగితే
దేశానికి జరిగినట్టే..
దేశం అనుభవించే
బానిసతనం నువ్వూ అనుభవించాల్సిందే..
అంటూ జాతిని
పురిగొల్పిన ఆవేశం..
ఆమె నేతృత్వమే
స్వరాజ్య సంగ్రామంలో
కీలక సన్నివేశం..
ఉరకలెత్తిన ఆమె స్ఫూర్తితోనే
బానిసత్వానికి ప్రాయోపవేశం!
స్వరాజ్యసంగ్రామంలో ఆవేశం..
స్వతంత్ర భారతంలో ఆదర్శం..
అదే అదే సరోజిని..
మొత్తంగా జనరంజని..!
నైటింగేల్ ఆఫ్ ఇండియా
సరోజిని నాయుడు జయంతి
సందర్భంగా ప్రణామాలు…