అన్నప్రసాద వితరణ ప్రారంభం
శ్రీశైలం, ఫిబ్రవరి : శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పులిహోరా. సాంబారన్నం, పెరుగన్నం మొదలైన అన్నప్రసాదాలను అందజేయనున్నారు. అలాగే భక్తులకు భీనుని కొలను కైలాసద్వారం మెట్ల మార్గంలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఆదివారం శ్రీ భమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భృంగివాహన సేవ విశేషపూజలు నిర్వహించారు. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరగనున్నాయి. సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
నేడు కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ
విద్యుత్ వెలుగుల్లో ముక్కంటీశుడి ఆలయం
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలు కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పరమశివుడి వరంతో కన్నప్పగా మారిన తిన్నడికి కొండపై స్థానం లభించింది. భక్తుడికి పైన స్థానమిచ్చి కింద దేవదేవుడు కొలువైన క్షేత్రం ఇది. భక్తుడికి తొలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ పలకడం ఇక్కడ ఆనవాయితీ. 13రోజులపాటు జరిగే ఉత్సవాల్లో కన్నప్ప ధ్వజారోహణం ప్రథమఘట్టం. ముందుగా ముక్కంటి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అలంకార మండపం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వేదపండితులు ప్రత్యేక పూజలు చేశాక, కన్నప్ప ధ్వజారోహణ మహాకత్రువును నిర్వహించి, దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఉభయదాతలుగా శ్రీకాళహస్తికి చెందిన శ్రీబోయ కులస్తుల వారి సంఘం వారు వ్యవహరిస్తారు.
*పంచ ముఖాలకు సంకేతం*
శివుడికి అయిదు ముఖాలెలా వచ్చాయో శివపురాణం, శత రుద్ర సంహిత గ్రంథాలు వివరించాయి. 19వ కల్పంలో శివుడి తొలి అవతారం ఎరుపు, నలుపు, తెలుపు వర్ణాలతో సద్యోజాతుడిగా అవతరించాడు.
అంటే తలవగానే పుట్టినవాడు. ఈ కారణంగానే బ్రహ్మదేవుడికి సృష్టించాలనే యోచన కలిగింది. 20వ కల్పంలో ఎరుపు రంగుతో ఉద్భవించి వామదేవుడై బ్రహ్మకు సృష్టించే శక్తి ఇచ్చాడు. 21వ కల్పంలో పసుపురంగులో తత్పురుషుడిగా పుట్టి బ్రహ్మకి సృష్టిని ఎలా విభాగించాలో చెప్పాడు. 22వ కల్పంలో నలుపు రంగుతో అఘోరునిగా బ్రహ్మకి కనిపించి సృష్టికి అవసరమైన పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. 23వ కల్పంలో శ్వేతవర్ణంలో ఈశానుడిగా ఉద్భవించాడు. ఈ అయిదు అవతారాలే పంచ బ్రహ్మ అవతారాలు. ఇవి పంచభూత సంబంధమైనందున శివుడు ముఖ పంచకుడయ్యాడు. వీటిలో ఈశానం అనేది మన ప్రాణంలో ఉంటుంది. తత్పురుషుడు మనలోని సత్వ, రజ, తమో గుణాలకు అధిపతి. అఘోరుడు బుద్ధికి ప్రతినిధి. వామదేవుడు అహంకారానికి, సద్యోజాతుడు మనసుకి అధికారులు. అందుకే మనందరిలో శివుడున్నాడు. శివుని అయిదు ముఖాలు చెప్పేదేమంటే పంచభూతాలను నియంత్రించకూడదు. లేదంటే అవి మనని నియంత్రించే శక్తులుగా రూపుదాలుస్తాయి. అలా ప్రకృతి బీభత్సాలకు మనమే కారణం అవుతాం.