DailyDose

వాలెంటైన్స్ డే స్పెషల్ : ప్రేమికుల రోజు ఎలా వచ్చింది? ఆనాడే ఎందుకు?

వాలెంటైన్స్ డే స్పెషల్ : ప్రేమికుల రోజు ఎలా వచ్చింది? ఆనాడే ఎందుకు?

ప్రేమికుల రోజు వచ్చేసింది. ప్రేమ పక్షులు మరో లోకంలో విహరించే రోజు రానే వచ్చింది. అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా వచ్చింది? ఫిబ్రవరి 14వ తేదీనే లవర్స్ డే గా ఎందుకు జరుపుకుంటారు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఈ కథనం. వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు లో స్పెషల్ స్టోరీ.

అలా ప్రేమికుల రోజు..

ప్రేమ పక్షులకు ఫిబ్రవరి 14 పండుగ దినం. రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకునే ‘వాలెంటైన్స్ డే’ కు పెద్ద కథే ఉంది. మూడో శతాబ్ధంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్.. యువకులకు వివాహాలు కాకుండా అడ్డుకున్నారు. దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశారు. క్లాడియస్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణం. పురుషులు పెళ్లిళ్లు చేసుకుంటే ఆలోచించే శక్తి నశిస్తుందనేది ఆయన అపోహ. ఆ మేరకు రాజ్యంలో ఎవరూ వివాహాలు చేసుకోవద్దని ఆజ్ఞ జారీ చేశాడు.

ఆయన పేరు మీదుగా..!

చక్రవర్తి క్లాడియస్ ఆదేశాల మేరకు రోమ్ లో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవారు. ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టం తీసుకొచ్చినట్లు చెబుతారు. అయితే పూజారి (సెయింట్) అయిన వాలెంటైన్.. చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించేవాడు. వివాహామైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుంటాడు. ఆ మేరకు తాను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు. దీంతో చాలామంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు. దాంతో వాలైంటైన్ తనను ధిక్కారించారని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

వాలెంటైన్ ప్రేమకు గుర్తుగా..

వాలెంటైన్ వ్యవహార శైలిపై క్లాడియస్ కోపం పెంచుకున్నాడు. దాంతో వాలెంటైన్ ను జైల్లో బంధించాడు. క్రీ.శ. 269, ఫిబ్రవరి 14న వాలెంటైన్‌కు ఉరిశిక్ష విధించాలని ఆదేశించాడు. అయితే ఉరితీసే ముందురోజు సాయంత్రం.. తాను ప్రేమించిన జైలు అధికారి కుమార్తెకు తొలిసారిగా ఆయన ప్రేమ సందేశం పంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ అధికారి కుమార్తెతో వాలెంటైన్ స్నేహం చేశాడు. ఆమె అంధురాలు కావడంతో వాలెంటైన్ చూపు తెప్పించారట. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది. ఆ ప్రేమ సందేశంలో ‘ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని రాసి ఉందంటారు. అలా వాలెంటైన్‌ను ఉరి తీసిన ఫిబ్రవరి 14.. లవర్స్ డే గా ప్రాచుర్యం పొందింది.