Politics

ఏపీ సర్కార్కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ

ఏపీ సర్కార్కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ

అమరావతి: జగన్ ప్రభుత్వాని కి హైకోర్టు లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ (AP Government Employees Union President Suryanarayana) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. తమకు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌ ముందు వారంతా మీడియాతో మాట్లాడారు.

అయితే రాజ్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడటం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, అదే విధంగా సంఘం గుర్తింపు ఇచ్చే సమయంలో నిబంధనలు ఉన్నాయంటూ సూర్యనారాయణ కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులను సూర్యనారాయణ హైకోర్టు లో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో గతంలో వాదనలు కూడా జరిగాయి. ఈ పిటిషన్‌ను న్యాయవాది ఉమేష్ చంద్ర ఫైల్ చేయగా… ఆయనతో పాటు సీనియర్ న్యాయవాది వైవీ రవి ప్రకాష్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం ఈరోజు… ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. దాంతో పాటు ప్రాథమిక హక్కులను మీరు ఎలా కాదంటారని ప్రశ్నించింది. నోటీసులపై స్టే విధిస్తూ.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.