DailyDose

వివాహాలూ తతంగాలూ

వివాహాలూ తతంగాలూ

వేడుక సంస్కృతిలో భాగం. మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేవరకూ జరుపుకునే అన్ని వేడుకలూ ఈ సంస్కృతిలో భాగమే. ఇలాంటి వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ వేడుక సాగుతుంది. తెలుగువారు జరుపుకునే వివాహవేడుకకీ కొన్ని ప్రత్యేకత లున్నాయి. ప్రాంతాలనుబట్టి, కులాలనుబట్టి చిన్నచిన్న మార్పులుంటాయి.

భారతదేశంలో వివాహం అనేది ఒక సంస్కారం. ఒక సుదీర్ఘ మానవ జీవనవ్యవస్థలో అయిదువేల సంవత్సరాల నుండో ఆ పై నుండో వస్తూ సాగుతూన్న ఒక నాగరిక వ్యవస్థావిశేషం. అది వైయక్తికంగా కనిపించే కల్యాణమైనా సమాజ కల్యాణ కార్యాలలో ఒకటి. అది పదిమందికి చెందిన కళ్ల వేడుక. బంధుమిత్ర సపరివార శుభాకాంక్షల డోలిక.

ఆదిమయుగ కాలం సంగతి వేరు. సంచార జాతులుగా సమాజ మానవసందోహాలున్న వాళ్ల స్థితిగతులు వేరు. ఇష్టమైన తావుల్లో కొన్నాళ్లుండడం మరోచోటికి బయలుదేరడం. వేటాడడాలు! పొట్ట నింపుకోవడాలు. ఇష్టమైనట్లు వ్యవహరిస్తూ స్త్రీ పురుషులు కలుస్తూ మానవసృష్టిని కొనసాగించిన ఆ కాలం, ఆ సందర్భాలూ వేరు. అదీ మన చరిత్రే. గడచిన చరిత్రే. అయితే ఇప్పుడు కొనసాగుతున్నది నడుస్తున్న వివాహవ్యవస్థ. వైదికమైనది. సంచార జాతులు సమూహజాతులయ్యాయి. వ్యవసాయం, పశుపాలన, అవసర కార్యకలాపాలలో ఇతర మానవుల అవసరాన్ని గుర్తించడం… ఇలా సాగుతూండగా కూడు, గూడు, ఉనికిలతో ‘మనికి’ మనిషి ప్రధాన అవసరమైంది. తాత్కాల అంశాలు శాశ్వత అంశాలయ్యాయి. కట్టుబాట్లు సామాజిక మయ్యాయి.

ఒప్పుదలలు సామాజికమైన సందర్భాలలో సంస్కారాలు కాలానుగుణంగా పరిమళించాయి. వివాహం మానవ జీవనచరిత్రలో భాగమైంది.

ఈజిప్టులో ‘మెన్సు’, గ్రీకుదేశంలో ‘సేక్రోసిస్‌’, హిందువుల్లో శ్వేతకేతువు వంటివారిని వివాహవ్యవస్థలకు మూలపురుషులుగా భావిస్తారు. శ్వేతకేతువు ఎవరో కాదు, మహాభారతం ఆది పర్వంలో చూస్తే కనిపించే ఉద్ధాలక మహర్షి కొడుకే శ్వేతకేతువు అని మనకు తెలుస్తుంది. పశుబలంతో ఒకడు తన తల్లిని తన ఎదుటే చేయి పట్టుకు లాక్కుపోవడం చూడగానే శ్వేతకేతువు మనస్సు కకావికలైంది. బలం కలవానిదే రాజ్యం అవడం చెడు సంప్రదాయమన్నాడు. అది వ్యభిచారం అవుతుందని పాపం వస్తుందని భావించి ఒక కట్టుబాటుకు వివాహవ్యవస్థకు మార్గ దర్శి అయ్యాడనేది ఒకటుంది. అంతకుమునుపు ఎప్పుడో వేద కాలంలోనే వివాహవ్యవస్థ దాఖలాలు లేకపోలేదు. ఊర్వశీ పురూరవుల కథనం ఋగ్వేదంలోనిదే. ఋగ్వేదంలో వివాహ సూక్తం అని పదవ మండలంలో 85వ సూక్తం వుంది. సూర్యుని కుమార్తె సూర్యను సోమునికిచ్చి పెళ్లి జరిపించిన అంశం భాసిస్తోంది.

యజ్ఞయాగాల కాలంలో పెళ్లి కాకపోతే పురుషునికి గుర్తింపు లేదు. తైత్తిరీయ బ్రాహ్మణంలో ‘అయజ్ఞియో వా ఏషయో పత్నీకః’ అని వుంది. అంటే భార్య లేనివాడు యజ్ఞహీనుడు అని. అంతేకాదు, అందులోనే, ‘అథో అర్థోవా ఏష ఆత్మవః యత్‌ పత్నీ’ అనీ వుంది. అంటే భార్య లేనివాడు, ఏకాకి అయిన వాడు అసంపూర్ణుడు అని. అందుకే భార్య అనే ఆమె సరదాగా అనుకునే వన్‌ ఫోర్తాంగి కాదు; ఆమె అర్థాంగి.

ఒకటీ రెండూ కాదు మనకు నూట ఎనిమిది ఉపనిషత్తులున్నాయి. అందులో ఒకటైన తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో గురువు శిష్యునితో ‘ప్రజాతమ్తం మా వ్యవచ్ఛేత్సీః’ అని ప్రబో ధించాడు. దాని అర్థం సంతానసూత్రానికి గండికొట్టకు నాయనా అని. ఆయురారోగ్య భాగ్యాలతో తులతూగాలని నిండు నూరేళ్లు జీవించాలని మానవుల శుభాకాంక్ష. భారతీయ శుభా కాంక్షలకు అతిశయోక్తి అలంకారాలుండి అవి రోదసి దాకా ప్రయాణిస్తాయి. ‘ఆచంద్రతారార్కం’ విలసిల్లాలని దీవించడంలో ఎంత పెద్దమనసు. ప్రపంచమానవుడు తలెత్తుకుని చెప్పుకోతగ్గ శుభా కాంక్ష భారతీయులది.

సుఖదుఃఖాల త్రాసులో ఊగిసలాడే మానవులు వీలైనంతగా ఆనందంతోనే గడపాలనుకోవడం సహజం. ఇన్నాళ్ల, ఇన్నేళ్ల ఆచారవ్యవహారాల్లో పదిమంది కలిసి తినడం, ఆనందించడం ఒక సామాజిక విశేషం. భారతీయుని జీవనంలో పుట్టింది మొదలు సంస్కారాలు, దానాలూ ధర్మాలు, అన్నప్రాశనం, కేశ ఖండనం, అక్షరాభ్యాసం వాటితో మాత్రమే ఊరుకోవడం లేదు.

పిల్లవాడు కాని పిల్ల కాని అడుగులేస్తే అరిసెలు, పలుకులొస్తే పంచదారచిలకలు, గడప దాటితే గారెలు, బోర్లా పడితే బూరెలు, గృహరాజ్యంలో ఆనందాల పంపకంలో స్త్రీ పురుషుల సంయుక్త కార్యాలు లేకుండా, ఇరుగు పొరుగుల వారు పాల్గొనకుండా ఒక్కటీ జరగదు. చిన్నప్పుడే ఇన్ని తతంగాలుండగా యుక్తవయస్సులు వచ్చాక జరిగే వివాహ సంస్కారంలో కొన్ని తతంగాలుండడం రకరకాలుగా ఉండడం సహజం.

భారతదేశంలో శాస్త్రం ఆచారమైంది. ఆచారం చట్టమైంది. సమాజమే సాక్షి అయిన న్యాయవ్యవస్థ యిది.

వివాహం ఒక సంతానవ్యవస్థ. అది స్త్రీ పురుషుల లైంగిక సౌఖ్యాలకు ఒక కట్టుబాటు. వివాహం ఒక ఆర్థికవ్యవస్థ. భార్య, వారసులు ఏర్పడి ఆస్తుల సంక్రమణానికి అది ఓ పునాది. భారతీయవ్యవస్థలో అధర్మపత్నులకు తావు లేదు; ధర్మపత్నులకే గౌరవాదరాలు.