ఇటీవల తాడేపల్లిలో దివ్యాంగురాలి హత్య ఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు . పోలీసులు త్వరగా స్పందించి వుంటే ఆమె హత్య జరిగేది కాదన్నారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఇటీవల ఎస్తేర్ రాణి అనే దివ్యాంగురాలి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కేసుపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం నేషనల్ ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లిలో సీఎం, డీజీపీ కార్యాలయాలు వున్నప్పటికీ మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
బాధితురాలిని నిందితుడు చిత్రహింసలు పెట్టాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వర్ల రామయ్య తెలిపారు. కానీ ఈలోగానే రాజు ఆమెను కత్తితో నరికి హత్య చేశాడని.. పోలీసుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. రాజు డ్రగ్స్‌కు బానిసయ్యాడని.. దీనిపై టీడీపీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి స్పందన కరువైందని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై లోతుగా దర్యాప్తు చేయాలని.. కొందరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు సైకో చేతిలో దారుణ హత్యకు గురయిన అంధురాలు ఎస్తేరు రాణి మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు.ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్దకు చేరుకున్న పద్మ మృతురాలు తల్లి, పెద్దమ్మతో పాటు ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్న పద్మ మహిళా కమీషన్ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.
అయితే వాసిరెడ్డి పద్మ వచ్చిన సమయంలోనే హాస్పిటల్ వద్దకు తాడేపల్లి మహిళలు, టిడిపి నాయకులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఛైర్ పర్సన్ కారుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టారు. మహిళల పై జరుగుతున్న దాడులపై పద్మ స్పందించాలని… లేదంటే మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేసారు. ఇలా ఆందోళన చేపట్టిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంతో వాసిరెడ్డి పద్మ కూడా అక్కడినుండి వెళ్లిపోయారు.